విద్యార్థి నేతలకు 2019లో నో టిక్కెట్..!

తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది క్రియాశీలకంగా తమ పాత్ర పోషించారు. వీరిలో పలు రాజకీయ పక్షాలతో పాటు జేఏసీ, విద్యార్థి సంఘాల నేతలు కూడా ఈ ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించారు. వీరి కష్టాన్ని గుర్తించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత ఎన్నికల్లో కొందరు విద్యార్థి సంఘ నేతలకు, ఉద్యోగ సంఘాల నేతలకు టిక్కెట్లు ఇచ్చారు. విద్యార్థి సంఘాల నేతల్లో పెద్దపల్లి నుంచి ఎంపీగా బాల్క సుమన్‌కు, నల్గొండ జిల్లా తుంగతుర్తి నుంచి గాదరి కిశోర్‌బాబుకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వగా ఇద్దరూ విజయం సాధించారు.
రాజకీయంగా ఇబ్బందులు...
అయితే ఇప్పుడు ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందా ? అంటే టీ పాలిటిక్స్‌లో అవుననే ఆన్సరే వినిపిస్తోంది. తెలంగాణా ఉద్యమ సమయంలో వీరిద్దరు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పక్షాన కీలకంగా పనిచేశారు. అదే సమయంలో టీఆర్ ఎస్వీ కార్యక్రమాల్లోనూ అంతే చురుగ్గా పాల్గొన్నారు. ఈక్రమంలోనే వీళ్ల పనితీరును సీఎం కేసీఆర్ గుర్తించి గత ఎన్నికల్లో టికెట్ కేటాయించగా ఇద్దరు విజయం సాధించారు. కాగా ఇటీవల వీరివురు రాజకీయంగా ఇబ్బందుల పాలవుతున్నారు. ముఖ్యమంత్రి కూడా వీరి పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరికీ పార్టీ టికెట్ దక్కదనే సంకేతాలను కూడా పంపినట్లు పార్టీలో ఇటీవల జోరుగా చర్చ జరుగుతోంది. సొంత నియోజకవర్గాల్లోని ప్రజల్లో పట్టు కోల్పోవడం, అదే సమయంలో పార్టీ క్యాడర్ కూడా దూరమవడంతో నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
బాల్క సుమన్ కు....
అదే విధంగా స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండక పోవడం, ప్రచారం కోసం నిత్యం అనవసర విషయాల్లో తల దూర్చడంతో ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురైనట్లు సీనియర్ నేతలు గుసగుస లాడుకుంటున్నారు. ఈక్రమంలోనే టికెట్ ఆశిస్తున్న సీనియర్ నాయకులు నియోజకవర్గంలో పట్టుబిగుస్తుండటంతో ఏకాకిగా మిగిలిపోతన్నారనే వాదన వినపడుతోంది. పెద్దపల్లిలో ఎంపీ సుమన్‌కు ఇప్పటికే సీనియర్ లీడర్, మాజీ ఎంపీ జి.వివేక్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. తనకు వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి టిక్కెట్ రాదని డిసైడ్ అయిన సుమన్ చెన్నూరు, బెల్లంపల్లి నుంచి అసెంబ్లీ సీటు అయినా రాకపోదా ? అన్న ఆశతో ఉన్నారు. అయితే ఈ రెండు రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీలో సీటు కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఇక తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్న గాదరి కిశోర్‌బాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటికే ఆయనపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఎక్కువుగా ఉంది. ఇక్కడ కూడా ఇద్దరు కొత్త వ్యక్తుల పేర్లు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నాయి. ఏదేమైనా గత ఎన్నికలకు ముందు కేసీఆర్ రెడ్ కార్పెట్ వేసి మరీ విద్యార్థి సంఘం నేతలకు టిక్కెట్లు ఇస్తే ఈ సారి మాత్రం ఆ పరిస్థితి కనపడడం లేదు.

