వర్మ ఎప్పుడు? ఎక్కడ? ఎలా..?

వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఇప్పట్లో పోలీస్ కష్టాలు తీరేలా కనపడటం లేదు. వర్మ ఏ ముహూర్తాన గాడ్ సెక్స్ ట్రూత్ వెబ్ సిరీస్ మొదలు పెట్టారో కానీ అప్పటినుంచి ఆయనకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. వరుసగా పలుచోట్ల పోలీస్ కేసులు ఎక్కడో ఒకచోట నమోదు అవుతుండగా హైదరాబాద్ పోలీసులు రెండో రౌండ్ విచారణకు రమ్మంటు ఆహ్వానించారు. ఈ రౌండ్ పూర్తి అయ్యాక వర్మ అరెస్ట్ తధ్యమని వార్తలు పెద్దఎత్తున ప్రచారం అవుతున్నాయి. మరోవైపు తెలంగాణ లోని సూర్యాపేటలో, విశాఖలో మహిళలు వర్మపై కేసులు నమోదు చేశారు. అమరావతి తో పాటు పలు చోట్ల మహిళల పట్ల వర్మ చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాలు కొనసాగిస్తూనే వున్నాయి. వర్మ లాంటి వ్యక్తిని జైల్లో పెట్టాలంటూ తీవ్ర స్థాయిలో మహిళా సంఘాల నేతలు ఉద్యమాలు చేస్తూనే వున్నారు.
రెండో రౌండ్ కఠినంగా వుండబోతుందా ...
రాంగోపాల్ వర్మ తొలి విచారణలో సక్రమంగా సహకరించకపోవడంతో బాటు పొంతనలేని సమాధానాలు చెప్పారని పోలీస్ వర్గాలు అంటున్నాయి. దాంతో రెండోసారి విచారణ మరింత కఠినంగా చేయాలని ఖాకీలు డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. 24 ప్రశ్నలతో కూడిన పరీక్షను వర్మ ఎదుర్కోనున్నారు. దాంతో బాటు గాడ్ సెక్స్ ట్రూత్ వెబ్ సిరీస్ నిర్మాణం ఎక్కడ? ఎప్పుడు? ఎలా? అన్న ప్రశ్నలు ఖాకీలనుంచి వస్తున్నాయి. తొలిసారి విచారణలో ఈ చిత్రం తాను స్కైప్ లో డైరక్షన్ ఇచ్చి చిత్రీకరణకు సహకరించానని ఒకసారి, తాను కొన్ని సలహాలు ఇచ్చానే తప్ప తీయలేదని మరోసారి ఇలా పొంతనలేని సమాధానాలతో వర్మ విచారణ లో ఇచ్చారని అంటున్నారు పోలీసులు. దాంతో ఈ ట్రిప్ ఆయనకు గట్టి ఉచ్చు బిగించే పనిలో పడ్డారు ఖాకీలు. విచారణ పూర్తి అయ్యాక ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువంటున్నారు. మరోవైపు వర్మ తన న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. ఈ కేసులనుంచి బయటపడే మార్గాలు వెతుక్కుంటున్నారు. మొత్తానికి అందరిని వివాదంలోకి లాగే వర్మ తానే ఉచ్చులో పడ్డారనే టాక్ వినవస్తుంది.
- Tags
- రాంగోపాల్ వర్మ

