వరుసగా... అందరూ.....ఒక్కొక్కరుగా...!

కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ టీడీపీ, వైసీపీలు వరుసగా రోజూ అవిశ్వాసంపై నోటీసులు ఇస్తున్న సంగతి తెలిసిందే. నోటీసులు ఇవ్వడం, సభను వాయిదా వేస్తుండటం గత పది రోజుల నుంచి రివాజుగా మారింది. ఈ నేపథ్యంలో మొన్న శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంపై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చింది. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగడంతో అధికార బీజేపీ కొంత ఇబ్బందిలో పడింది.
తాజాగా సీపీఎం కూడా....
అయితే తాజాగా సీపీఎం కూడా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈరోజు లోక్ సభ సెక్రటరీ జనరల్ కు సీపీఎం నోటీసలు ఇవ్వడం విశేషం. దీంతో మొత్తం నాలుగు పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చినట్లయింది. ఇక తృణమూల్ కాంగ్రెస్ కూడా త్వరలోనే నోటీసు ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి.
బుధవారం వచ్చే ఛాన్స్....
ఇక మంగళవారం సభ ప్రారంభమైనప్పటికీ, బుధవారం అవిశ్వాసంపై చర్చకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. బీజేపీ కూడా అందుకు సిద్ధమయింది. ఈ మేరకు మంత్రులకు సంకేతాలు అందినట్లు సమాచారం. తమకు పూర్తి స్థాయి బలం ఉందని, తాము ఓటింగ్ కు, చర్చకు ఎందుకు వెనకడగు వేస్తామని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాము చర్చల ద్వారా ఏపీకి ఏమేం సాయం చేశామో అన్నీ చెబుతామంటున్నారు. తెలుగుదేశం పార్టీ చెబుతున్న అబద్ధాలను సభ సాక్షిగా ఎండగడతామని బీజేపే నేతలు చెబుతున్నారు.
వెనక్కు తగ్గిన టీఆర్ఎస్.....
ఇప్పటివరకూ టీఆర్ఎస్, అన్నాడీఎంకేలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనలకు దిగడంతోనే అవిశ్వాసం చర్చకు రావడం లేదన్నది ప్రధాన ఆరోపణ. టీఆర్ఎస్ రిజర్వేషన్ల అంశంపైన, అన్నాడీఎంకే కావేరి జలాలకు మండలి ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఆందోళనకు దిగాయి. అయితే ఈరోజు జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తమ కారణంగానే అవిశ్వాస తీర్మానం వాయిదా పడుతుందన్న ఆరోపణల నేపథ్యంలో వెల్ లోకి వెళ్లకుండా ఇక ఆందోళనలను కొనసాగిస్తామని టీఆర్ఎస్ నేతలు చెప్పారు. అయితే తమపై కొందరు ఏపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. రిజర్వేషన్ల అంశం కోసం తాము పార్లమెంటు ప్రారంభం అయిన నాటి నుంచి ఆందోళన చేస్తున్నామని చెప్పారు.
