లోకేష్ ఖాతాలో ఒకటి

రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల తుది గడువు సోమవారంతో ముగియనుంది. ఈనేపథ్యంలో టీడీపీ తాము పోటీ చేసే రెండు స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. నిన్న సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు వారి నుంచి అభిప్రాయాలను సేకరించారు. కొందరి పేర్లను చంద్రబాబుకు సూచించారు. భవిష్యత్ అవసరాలు, సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధినేత రాజ్యసభ అభ్యర్థులను ఖారారు చేయనున్నారు.
నేడు ప్రకటన చేయనున్న బాబు....
ఇప్పటికే రాజ్యసభ పదవీకాలం పూర్తయిన సీఎం రమేష్ మళ్లీ మరొకసారి తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అలాగే కంభంపాటి రామ్మోహనరావు కూడా తనను రాజ్యసభ కు పంపాలని చంద్రబాబుపై వత్తిడి తెస్తున్నారు. కాని వీరిద్దరిలో ఒకరికే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు బీసీలకు, ఎస్సీలకు ఒక సీటును కేటాయించాలని భావిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. బీసీల కోటాకింద అనేక మంది ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు.
లోకేష్ దగ్గరకు క్యూ.....
ఇక పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ ఛాంబర్ కిటకిటలాడుతోంది. ఆశావహులందరూ చినబాబును ప్రసన్నం చేసుకునేందుకు క్యూ కడుతున్నారు. తాము పార్టీకి చేసిన సేవలు, కొన్నేళ్ల నుంచి నమ్ముకుని ఉన్న తమకు అవకాశం కల్పించాలని లోకేష్ కు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. అయితే లోకేష్ సిఫార్సుతో ఒకరికి గ్యారంటీ అన్న టాక్ కూడా బలంగా విన్పిస్తోంది. పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని లోకేష్ ఇప్పటికే చంద్రబాబుకు ఒక పేరు సూచించారని సమాచారం. మొత్తం మీద రేపు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఈరోజు చంద్రబాబు ఇద్దరి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. వారెవరనేది కాసేపట్లో తేలనుంది.
- Tags
- టీడీపీ లో్కేష్
