లాలూ యాదవ్ పర్మినెంట్ అడ్రస్ ఇక జైలేనా?

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పట్లో జైలు నుంచి వచ్చేట్లు లేరు. వరుసపెట్టి ఆయనకు శిక్షలు పడుతున్నాయి. తాజగా పశు దాణా కుంభకోణం మూడో కేసులో లాలూప్రసాద్ దోషిగా తేలారు.. ఈ కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాధ్ మిశ్రాను కూడా దోషిగా తేల్చారు. చైబాసా ట్రెజరీలో డబ్బులు నొక్కేసిన కేసులో లాలూ దోషిగా తేలింది. శిక్షను రేపు ఖరారు చేయనున్నారు. అయితే లాలూ యాదవ్ ఇప్పటికే పశుదాణాకేసులో మూడున్నరేళ్లు జైలు శిక్ష పడి ప్రస్తుతం రాంచీలోని బిర్సాముండా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
వరుసబెట్టి శిక్షలు....
వరుసబెట్టి శిక్షలు పడుతుండటంతో లాలూ యాదవ్ జైలు నుంచి ఇప్పట్లో వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. ఆర్జేడీ నేతలు ఆందోళనలో ఉన్నారు. తాజాగా పశుదాణ కుంభకోణం మూడో కేసులో చైబాసా ట్రెజరీ నుంచి 36 కోట్ల రూపాయలు అక్రమంగా తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసును విచారించిన సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్.ఎస్. ప్రసాద్ ఈకేసులో లాలూతో పాటు జగన్నాధ్ మిశ్రా కూడా దోషిగా తేల్చారు. 2013లో పశుగ్రాసం కుంభకోణం మొదటి కేసులో లాలూకు ఐదేళ్లు జైలు శిక్ష పడింది.
మూడు కేసుల్లో.....
అయితే పశుగ్రాసం కుంభకోణం రెండో కేసులో లాలూయాదవ్ కు మూడున్నరేళ్ల శిక్ష పడింది. గత నెల 26 నుంచి లాలూ యాదవ్ బిర్సా ముండా జైలులోనే ఉంటున్నారు. అయితే ఒకే కేసును ముక్కలుగా చేసి శిక్ష విధించడంపై రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కు శరద్ యాదవ్ అండగా నిలిచారు. లాలూపై కావాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఇది ఎంతకాలం సాగదని, త్వరలోనే నిజాలు వెల్లడవుతాయని శరద్ యాదవ్ అన్నారు. మొత్తం మీద వరుసగా శిక్షలు పడుతుండటంతో లాలూ యాదవ్ ఇప్పట్లో జైలు నుంచి వచ్చే అవకాశం లేదు. దీనిపై హైకోర్టుకు వెళ్లే యోచనలో లాలూ కుటుంబ సభ్యులున్నారు.

