లాలూ ఇక జైలు పక్షేనా?

లాలూ ప్రసాద్ యాదవ్. బీహార్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పదవులు అనుభవించారు. ఆర్జేడీ అధినేతగా ఆయన విలాసవంతమైన జీవితం గడిపారు. కాని ఆయన గడ్డి కుంభకోణంలో చిక్కుకుని రాంచీలోని బిస్రా ముండా జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సీబీఐ కోర్టు తీర్పుతో లాలూ యాదవ్ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. పశుగ్రాసం కుంభకోణంలో మొత్తం నాలుగు కేసులకు సంబంధించి లాలూ యాదవ్ దాదాపు 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తోంది.
నాలుగు కేసుల్లో.....
అంటే లాలూ యాదవ్ ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 14 ఏళ్లు జైలు అంటే ఆయన జీవితం చివరి దశ మొత్తం జైలులోనే ఉండాల్సి వస్తోంది. పశుగ్రాసం కుంభకోణం నాలుగో కేసులో ఈరోజు లాలూకు రాంచీ ప్రత్యేక కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో లాలూ యాదవ్ తో పాటు 19 మందికి శిక్షలు ఖరారు చేసింది. ఇందులో లాలూయాదవ్ కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటుగా 30 లక్షల జరిమానా విధించింది. గతంలో మూడు కేసుల్లోనూ లాలూ దోషిగానే తేలారు.
తాజాగా ఏడేళ్లు జైలు శిక్ష....
ఇప్పటి వరకూ పశుగ్రాసం కుంభకోణంలో నాలుగు కేసులను న్యాయస్థానం విచారించింది. 2013లో ఈ కేసులో ఆయన దోషిగా నిర్ధారణ కావడంతో లాలూ యాదవ్ ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే 2017 డిసెంబర్ లో పశుగ్రాసం కుంభకోణం రెండో కేసులోనూ లాలూ దోషిగా తేల్చింది కోర్టు. ఈ కేసులో మూడున్నరేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఇక ఈ ఏడాది జనవరిలో జరిగిన మూడో కేసులో లాలూ యాదవ్ కు ఐదేళ్లు జైలు శిక్ష పడింది. ఈ కేసులో ఇప్పటికే ఆయన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా ఈరోజు నాలుగో కేసులో ఏడేళ్లు జైలు శిక్ష పడటంతో లాలూ యాదవ్ ఇక జైలు పక్షిగానే ఉంటారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కోర్టు తీర్పు చూసి ఆర్జేడీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నేతను కావాలనే కేసుల్లో ఇరికించి జైలు పాలు చేశారని, చివరకు న్యాయమే గెలుస్తుందంటున్నారు.
