రేవంత్ భయపడుతుంది దీనికేనా?

రేవంత్ ఎందుకిలా చేశారు? ఉప ఎన్నికకు భయపడే ఇలా చేశారా? ఇదే చర్చ ప్రస్తుతం కాంగ్రెస్, టీఆర్ఎస్ లో ప్రముఖంగా జరుగుతోంది. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పేశారు. ఆయన తన గన్ మెన్లను ఉపసంహరించుకున్నారు. గత పదిహేను రోజులుగా జరుగుతున్న శాసనసభ సమావేశాలకూ ఆయన హాజరుకావడం లేదు. ఎమ్మెల్యే క్వార్టర్ ను కూడా ఖాళీ చేశారు. కాని రాజీనామా లేఖ మాత్రం స్పీకర్ కు అందలేదు. దీంతో రేవంత్ రాజీనామా పై డ్రామాలాడుతున్నారని గులాబీ పార్టీ నేతలు విమర్శల దాడిని పెంచారు. రేవంత్ ఉప ఎన్నికలకు భయపడే రాజీనామా లేఖను స్పీకర్ కు పంపలేదని టీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు స్పీకర్ కు ఫ్యాక్స్ చేశానని రేవంత్ చెబుతున్నారు. కాని స్పీకర్ కార్యాలయం మాత్రం దీనిని ధృవీకరించడం లేదు. రేవంత్ రాజీనామా లేఖ తమ అధినేత వద్ద లేదని టీటీడీపీ అధ్యక్షుడు రమణ కూడా తెలిపారు.
ఆత్మీయ సదస్సుల పేరుతో.....
కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఉప ఎన్నికలకు సిద్ధమయి వెళితే గెలుపు సాధ్యమవతుందా? అన్న అనుమానం కూడా రేవంత్ రెడ్డికి ఉన్నట్లు చెబుతున్నారు. తొలుత పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాతనే రాజీనామా లేఖను స్పీకర్ కు ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రాజీనామా లేఖ ఇవ్వాలనుకుంటే నేరుగా స్పీకర్ కార్యాలయానికి వచ్చి ఇచ్చే అవకాశముంది. కాని రేవంత్ ఇప్పటి వరకూ ఆ పని చేయలేదు. ఆత్మీయ సమావేశాల పేరుతో కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ పర్యటిస్తున్నారు. తనకు పూర్తి నమ్మకం కలిగిన తర్వాతనే రాజీనామా లేఖను స్పీకర్ కు ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ కూడా రేవంత్ పై వత్తిడి పెంచుతోంది. దమ్ముంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద రేవంత్ రాజీనామా వ్యవహారం పదిహేను రోజుల నుంచి తేలకుండానే ఉండటం విశేషం.
- Tags
- రేవంత్ రెడ్డి

