రాహుల్ ప్రవేశాన్ని ఎందుకు నిషేధిస్తున్నారో?

మాజీ సైనికుడి ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారుతోంది. మరణించిన సైనికుడి కుటుంబాన్ని పరామర్శించడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెళ్ళినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. దీనికి రాహుల్ గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. తనను అడ్డుకోవడం అప్రజాస్వామికం అని రాహుల్ విమర్శించారు.
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానం విఫలం అయిందని, అందువల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు, మాజీ సైనికుడు సూసైడ్ నోట్ రాసి పెట్టి మార్కించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి పర్వదినం నాడు సరిహద్దుల్లో మిలిటరీతో గడిపిన సందర్భంలో... ఈ విధానం తీసుకురావడం ద్వారా తమ ప్రభుత్వం మాజీ సైనికుల కోరికను నెరవేర్చిందని ఘనంగా ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఇలాంటి దుర్ఘటన జరిగింది.
కనీసం పరామర్శకు వెళ్లిన ప్రతిపక్ష నాయకుడిని అనుమతించకపోవడం ప్రభుత్వంలో భయ చిహ్నంగా కనిపిస్తోంది. గతంలో యూనివర్సిటీ లలోకి రాహుల్ ప్రవేశించకుండా అడ్డుకున్న మోడీ సర్కారు, అప్పుడంటే సునిశితమైన అంశాన్ని రాజకీయం చేయరాదని అన్నారు. మరి ఇప్పుడు ఏమి చెబుతారు. ఇప్పుడు అంశంలో సున్నితత్వం గురించి బుకాయిస్తే కుదరదు. విధానంలో లోపం గురించి ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో మోడీ సర్కారు జవాబుదారీ తనం వహించాలి.

