రాహుల్ కు అంతా సిద్ధమే...!

19 ఏళ్ల పాటు అధ్యక్ష బాధ్యతలు వహించిన అరుదైన రికార్డును సోనియా గాంధీ సాధించారు. జాతీయ కాంగ్రెస్ కు దీర్ఘకాలం అధ్యక్షురాలిగా వ్యవహరించిన సోనియా..ఇకపై ఆ బాధ్యతలను తనయుడిపై పెట్టనున్నారు. రాహుల్ గాంధీకి ఏఐసీసీ పగ్గాలు అప్పగించేందుకు అంతా సిద్ధమైంది. సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై నూతన అధ్యక్షుడి ఎన్నికపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. సోనియా గాంధీ ఇటీవల కాలంలో తరచూ అనారోగ్యానికి గురికావడం......ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటుండటంతో అధ్యక్షుడిగా రాహుల్ ఎంపిక అనివార్యంగా కన్పిస్తోంది.
డిసెంబర్ 8నాటికి......
అయితే ఇందుకోసం పార్టీ ఎన్నికల కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 1వ తేదీ వరకూ నామినేషన్ల గడువు ఉన్నప్పటికీ... అధ్యక్ష పదవికి వేరే వ్యక్తి నామినేషన్ వేసే అవకాశమే లేదు. దీంతో రాహుల్ ఎంపిక ఇక లాంఛనమేనన్నది అందరికీ తెలసిందే. రాహుల్ కు గుజరాత్ ఎన్నికల బాధ్యతలో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 9,14వ తేదీల్లో గుజరాత్ ఎన్నికలు జరగనుండటంతో రాహుల్ క్షణం తీరిక లేకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే రేపు సూత్రప్రాయంగా రాహుల్ పేరును ప్రకటించే అవకాశముంది. డిసెంబర్ 8వ తేదీ నాటికి రాహుల్ పేరును అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశముంది.
- Tags
- రాహుల్ గాంధీ

