రజనీ బలం ఏంటో తెలుసా?

తమిళనాట కమల్ హాసన్ పార్టీ పెట్టడం పూర్తయిపోయింది. ఇక రజనీకాంత్ మిగిలారు. అయితే రజనీకాంత్ నిదామనే ప్రధానం అన్న పంథాలో కొనసాగుతున్నారు. నిన్న మొన్నటి వరకూ రజనీకాంత్ పంథా ఇదే. అయితే కమల్ పార్టీ ప్రకటనతో రజనీకాంత్ కొంత వేగం పెంచారు. తనపై వస్తున్న విమర్శలకు కూడా ఆయన చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాల వారీగా ఇన్ ఛార్జుల నియామకంపై రజనీకాంత్ దృష్టి పెట్టారు. జిల్లా ఇన్ ఛార్జుల నియామకం పూర్తయిన తర్వాత ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు.
కమల్ ప్రకటన తర్వాత.....
ఈనెల 20వతేదీ నుంచి రజనీకాంత్ వివిధ జిల్లా నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాలకు రజనీకాంత్ హాజరుకావడం లేదు. ఆయన సన్నిహితులు మాత్రమే హాజరై జిల్లాల నుంచి వచ్చిన వారి సలహాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కాంచీపురం, విల్లుపురం, కడలూరు జిల్లాల ఇన్ ఛార్జుల నియామకంపై చర్చించారు. ఒక అవగాహనకు కూడా వచ్చారు. అయితే రజనీకాంత్ ఈ సమీక్షలకు హాజరుకావడం లేదు. కాని కమల్ పార్టీ ప్రకటన చేసిన తర్వాత నిన్న సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. అభిమానులతో ముచ్చటించారు.
త్వరలో రాష్ట్ర పర్యటన.....
అంతేకాదు తనకు ధైర్యంలేదని, భయమని కొందరు విమర్శలు చేస్తుండటాన్ని కూడా రజనీ ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. విమర్శలు చేసిన వాళ్లని పట్టించుకోకుండా క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేయాలని వారు కోరారు. 32 ఏళ్లుగా తనకు అండగా ఉన్న అభిమానులతో రాజకీయాల్లోకి వస్తున్నానని, బలంగా వస్తున్నానని ఆయన ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమకు ఎవరూ రాజకీయ పాఠాలు చెప్పనవసరం లేదని, ఒకరితో పోటీ అవసరం లేదని, మన పని మనం చేసుకువెళదామని ఆయన చెప్పారు. జిల్లాల ఇన్ ఛార్జుల నియామకం పూర్తయిన వెంటనే తాను రాష్ట్ర పర్యటనకు సిద్ధమని రజనీ ప్రకటించారు.
- Tags
- రజనీకాంత్

