రజనీ బయట పడిపోతారా?

ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ప్రకటన రేపు రానుందా? అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్షణం రేపు రానుందా? అదే ఇప్పుడు తమిళనాడు అంతటా పండగ వాతావరణం నెలకొంది. సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు ఈ నెల 12వ తేదీ. అంటే రేపు. తమిళ రాజకీయాల్లోకి తలైవా వస్తున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత మే నెలలో రజనీకాంత్ జిల్లాల వారీగా అభిమానులతో భేటీ అయి రజనీ తన మనసులో మాటను చెప్పేశారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అయితే ఆ తర్వాత మాత్రం రజనీ సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయారు. కాని రేపు పుట్టిన రోజు సందర్భంగా రజనీ నుంచి రాజకీయ ప్రకటన ఉంటుందని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు. రజనీకాంత్ పుట్టిన రోజు వేడుకలను తమిళనాడు అంతటా చేసేందుకు ఆయన అభిమానులు సిద్ధమయ్యారు. సేవాకార్యక్రమాలతో రజనీ పుట్టిన రోజు వేడుకలను జరపాలని నిర్ణయించారు.
జనవరిలోనే అంటున్న....
ఇప్పటికే జిల్లాల్లో దీనికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తయ్యాయి. ముఖ్యంగా తమిళనాడు ప్రధాన నగరాల్లో రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. అయితే రజనీ మాత్రం జనవరిలో రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేస్తారని ఇటీవల ఆయన సోదరుడు సత్యనారాయణరావు ప్రకటించిన సంగతి తెలిసిందే. పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి ప్రకటన ఉండదని ఆయన తెలిపారు. కాని ఫ్యాన్స్ మాత్రం పుట్టినరోజునే ప్రకటిస్తే మంచిదని కొందరు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడింది. దీంతోనే రజనీ రాజకీయాల్లోకి రావాలని ఉత్సాహ పడుతున్నారు. ఈ నెల చివర్లో రజనీకాంత్ మరోసారి తన అభిమానులతో భేటీ కానున్నారు. ఆ భేటీలో కొంత క్లారిటీ ఇచ్చి జనవరిలో పూర్తి స్థాయి ప్రకటన చేస్తారనిచెబుతున్నారు. అయితే పుట్టిన రోజు సందర్భంగా రజనీ నుంచి రాజకీయ ప్రకటన ఉంటుందని కూడా కొందరు చెబుతున్నారు. మొత్తం మీద రేపు తమిళనాడులో పండగ వాతావరణం నెలకొంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
- Tags
- రజనీకాంత్

