యువరాజు సారథ్యంలోనే భేటీ : అమ్మ గైర్హాజరు!

అధికారికంగా ఆయనకు ఇంకా కిరీటధారణ జరగనేలేదు. కానీ.. పార్టీలో ఆయన చక్రవర్తిత్వానికి మాత్రం తిరుగులేదు. అయితే అధికార పదవి ద్వారా బాధ్యత తీసుకోవడానికి విముఖంగా ఉంటాడని పలువురు అంటూ ఉండే రాహుల్ గాంధీ సారథ్యంలోనే .. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తొలిసారిగా సమావేశం అయింది. పార్టీ కి అద్యక్షుడు కాకపోయినప్పటికీ.. సోనియా అనారోగ్యం కారణంగా గైర్హాజరవడంతో.. అనివార్యంగా రాహుల్ గాంధీ తానే అధ్యక్షత వహించాల్సి వచ్చింది.
రాహుల్ గాంధీ ప్రస్తుతం యూపీ ఎన్నికల ప్రచార పర్వంలో బిజీగా గడుపుతున్నారు. నిర్దిష్టంగా యూపీలో తన ప్రచారం పార్టీని అధికారంలోకి కాదు కదా.. ప్రతిపక్షంలోకి అయినా తీసుకురాగలదనే విశ్వాసం ఆయనకు ఏపాటి ఉన్నదో తెలియదు. అయితే.. రాహుల్ మాత్రం ఎప్పటిలాగే ఆ రాష్ట్ర ఎన్నికల గురించి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు యూపీ, పంజాబ్ ఎన్నికల తర్వాతనే రాహుల్ గాంధీకి పార్టీ అధ్యక్ష స్థానంపై పట్టాభిషేకం ఉంటుందని, అప్పటిదాకా ఆయన నిరీక్షించాల్సిందేనని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ లోగా.. రాహుల్ గాంధీ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా.. కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలను ఆయన చేపట్టాల్సి వచ్చేలా ఉంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించడం రూపేణా.. రాహుల్ గాంధీ.. సోమవారం నాడు ఒకరకంగా పగ్గాలు చేతిలోకి తీసుకున్నట్టే. సోనియాకు అనారోగ్యం కారణంగా, ఆమె సమావేశానికి రాలేకపోవడం వల్ల రాహుల్ చేతికి పగ్గాలు వచ్చాయనేది వేరే సంగతి. మొత్తానికి ఆయన అధ్యక్షతన జరుగుతున్న తొలి వర్కింగ్ కమిటీ సమావేశం ఇది. ముందు ముందు ఆయన పరిస్థితుల్ని ఎలా నెగ్గుకు వస్తారో చూడాలి.

