మోదీ సెలవులు తీసుకోవడం లేదు.. అయితే ఏంటట?

ప్రధానిగా మోదీ భక్తులకు మరొక శుభవార్త. తమ అభిమాన నాయకుడు మోదీ ఎంతటి మహానుభావుడో ప్రజల్లో ప్రచారం చేసుకోవడానికి వారికి మరొక అంశం కూడా దొరికింది. మోదీ ప్రధాని అయిన తర్వాత ఇప్పటిదాకా , ఈ రెండున్నరేళ్లలో అసలు సెలవులే తీసుకోలేదని పీఎంవో ప్రకటించింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఇప్పటిదాకా ప్రధానులు తీసుకున్న వివరాలు వెల్లడించాలంటూ ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు పీఎంవో ఈ వివరాలను వెల్లడించింది. మోదీ రెండున్నరేళ్లుగా సెలవే తీసుకోకుండా పనిచేయడాన్ని గురించి మీడియాలో ప్రముఖంగా కథనాలు వచ్చాయి.
చాలా బాగుంది. ఇంతటి అంకితభావంతో సెలవులు తీసుకోకుండా పనిచేసే ప్రధాని దొరకడం దేశానికి కూడా చాలా మంచి పరిణామం. అలాగే నరేంద్రమోదీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కూడా ఎంత పక్కాగా ఉంటారో కూడా పీఎంవో గతంలో వెల్లడించింది. కాలహరణం లేకుండా... ఆయన విదేశీ టూర్లు తిరిగేటప్పుడు ఎక్కువగా విమానాల్లోనే నిద్రపోతారని, దిగగానే తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పడిపోతారని వెల్లడించింది.
అయినా ప్రధాని వంటి అత్యున్నతమైన హోదాలో ఉన్న వ్యక్తికి సెలవురోజు- సెలవు కాని రోజు మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుందో మనకు అర్థం కాని సంగతి. అయినా ఇక్కడ రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇలాంటి వివరాలను రాబడుతున్నప్పుడు.. మనకు ఒక కారణానికి బాధ కలుగుతుంది. ఈ చట్టం కింద ప్రశ్నలు సందిస్తే.. ప్రధాని మోదీ ఇప్పటిదాకా ఎన్ని దేశాలు పర్యటించారో , ఎన్నిరోజులు విదేశాలలో గడిపారో, ఎన్ని రాత్రులు విమానాల్లో నిద్రపోయారో, ఎలా సెలవులు లేకుండా పనిచేస్తున్నారో.. ఇలాంటి పాజిటివ్ ప్రచారం వచ్చే సంగతులు అన్నిటినీ పీఎంవో చాలా వెంటనే స్పందించి తెలియజెబుతుంది. అదే సమయంలో.. ఇప్పటిదాకా మోదీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు ఎంత.. అని అడిగితే మాత్రం.. ఇప్పటిదాకా వాటిని కూడి లెక్కవేయడం జరగలేదని, ‘‘ఆ వివరాలు చెప్పలేం , సిద్ధంగా లేవు’’ అని సమాధానం వస్తుంది. మోదీ మీద మరక పడుతుందనకుంటే.. ఆ వివరాల్ని బయటకు పొక్కనివ్వరు.. మోదీ భజనకు ఉపయోగపడుతుందనకుంటే ఆ వివరాలు వెల్లడిస్తారు. మరిక ఇలాంటి పదునులేని సమాచార హక్కు చట్టం ఉండి ఏంటి ప్రయోజనం... అనుకుంటున్నారు జనం.

