మోదీ రాలేదు.. కానీ, వెంకయ్య వచ్చారు!

తమిళనాడులో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించడానికి ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ రాబోతున్నారంటూ రెండు రోజులుగా తీవ్రమైన ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏమో గానీ.. ప్రధాని మాత్రం రాలేదు. ఆయన తరఫున అన్నట్లుగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెన్నై అపోలోలో చికిత్స పొందుతున్న జయలలితను ఆదివారం నాడు పరామర్శించారు. ఆదివారం హైదరాబాదులో స్వచ్చాగ్రహ షార్ట్ ఫిలిం ల ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు అనంతరం చెన్నై వెళ్లి అక్కడ జయలలితను పరామర్శించారు.
జయలలిత అనారోగ్యం నుంచి కోలుకుంటున్నట్లుగా అపోలో వైద్యులు తనకు చెప్పారని ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. మూడు నాలుగు రోజులుగా జయలలిత చికిత్సకు బాగా స్పందిస్తున్నట్లుగా, కొంత కోలుకుంటున్నట్లుగా డాక్టర్లు వెల్లడిస్తుండడంతో రాజకీయ ప్రముఖులు ఒక్కరొక్కరుగా ఆమెను ఆస్పత్రిలో పరామర్శిస్తున్నారు. రాహుల్ తరువాత.. తమిళనాడు నాయకులు స్టాలిన్, వైగో, ఇవాళ రామస్వామి తదితరులు కూడా జయలలితను పరామర్శించిన వారిలో ఉన్నారు.
రెండు రోజుల కిందట కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నై వచ్చి జయలలితను పరామర్శించి వెళ్లిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎంత కొమ్ములు తిరిగిన జాతీయ పార్టీలు అయినా సరే.. తమిళనాడులో ద్రవిడ పార్టీల మీదనే ఆధారపడవలసిన పరిస్థితుల్లో... జయలలిత పరామర్శ అనేది కీలక విషయం కావడంతో ప్రధాని మోదీ కూడా రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయింది. వెంకయ్యనాయుడు జయలలితను పరామర్శించారు.

