మోడీ మ్యాజిక్ చేసేస్తారా?

మోడీ సర్కార్ వచ్చే నెలలోనే పార్లమెంటు లో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతోంది. ఎన్నికల ముందు బడ్జెట్ కాబట్టి ప్రజలపై వరాలజల్లులు కురిపిస్తారన్న వార్తలు విన్పిస్తున్నాయి. అరుణ్ జైట్లీ ఇప్పటికే దీనిపై కసరత్తులు పూర్తి చేశారు. ఈ బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ కానుండటంతో అధికార బీజేపీకి కీలకంగా మారనుంది. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ సర్వేలు, గుజరాత్ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించడం వంటి అంశాలను మోడీని ఇబ్బంది పెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సునాయాసం కాదన్నది అర్థమైన మోడీ సర్కార్ ఈ బడ్జెట్ ను ప్రజారంజకంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతోంది.
ప్రజల్లో వ్యతిరేకత....
ఇప్పటికే జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజల్లో అధిక శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రయోజనమేంటన్న ప్రశ్న కూడా తలెత్తింది. ఇక జీఎస్టీ పుణ్యమా అని ఇటు వ్యాపారులు, అటు సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా అసహనానికి గురవతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో రానున్న బడ్జెట్ పైనే మోడీపార్టీకి ఓట్లు రాలతాయన్నది కాదనలేని వాస్తవం. మోడీ తాను చేసిందే రైట్ అనుకుంటే పొరపాటవుతుందని, ప్రజల ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కు రూపకల్పన చేయాలని సొంత పార్టీ నేతల నుంచే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
ఎన్నికల బడ్జెట్ ను.....
ముఖ్యంగా దేశంలో నిరుద్యోగం తీవ్రంగా ఉంది. పెద్ద నోట్ల రద్దుతో పరిశ్రమలు దెబ్బతినడంతో ఉపాధి అవకాశాలు లేవు. ఉన్న ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి. ఇక రైతంగా సమస్యలు కూడా అనేకం. ఇప్పటికే తమిళనాడు రైతులు ఢిల్లీలో అనేకసార్లు ఆందోళన చేశారు. రాజస్థాన్ లోనూ కాల్పుల వరకూ వెళ్లింది. మహారాష్ట్రలో రైతు ఉద్యమంలో హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో ఈ రంగాలకు ఊతమిచ్చేలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు. సిమెంట్ ధరలు పెరగడంతో రియల్ బిజినెస్ కూడా డల్ అయింది. ఇక వైద్యం, విద్య పెద్ద భారంగా మారిపోయింది. దీనిపైన కూడా బడ్జెట్ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆదాయపుపన్ను పరిమితిని కూడా తగ్గించే అవకాశముందంటున్నారు. ప్రస్తుతం 2.5 లక్షల వరకూ ఆదాయపు పన్ను చెల్లించనక్కరలేదు. అయితే ఈ పరిమితిని మూడు లక్షలకు పెంచే యోచనలో ప్రభుత్వంఉంది. ఫిక్స్ డ్ డిపాజిట్ల పై ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశముంది. జీఎస్టీ నుంచి మరికొన్ని వస్తువులకు మినహాయింపు లభించే అవకాశముంది. మొత్తం మీద 2018-19 వార్షిక బడ్జెట్ లో మోడీ మ్యాజిక్ ఉంటుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. అలా లేకుంటే వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీ కష్టాలు తప్పవన్న హెచ్చరికలు కూడా విన్పిస్తున్నాయి.
- Tags
- మోడీ మ్యాజిక్

