మోడీ మీరు తప్పు చేశారు....!

అరుణ్ జైట్లీ తాజా బడ్జెట్ పై కమలం పార్టీ సొంత నేతలే పెదవి విరుస్తున్నారు. ఎన్నికల బడ్జెట్ కావడంతో ఎంపీలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే చారిత్రాత్మక బడ్జెట్ అని చెప్పిన మోడీ మాటకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే గుసగుసలాడుకున్నారు. పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఈ సంఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఈ బడ్జెట్ సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేదిగా లేదన్నది బీజేపీ ఎంపీల అభిప్రాయం. మరో ఏడాదిలో ఎన్నికలకు వెళుతున్న తరుణంలో ప్రజాకర్షక బడ్జెట్ పెడతారునుకుంటే...సాదాసీదాగా ఉందని పలువురు ఎంపీలు ఛలోక్తులు కూడా విసురుకున్నారు. అంతేకాదు రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు ఆరోజే రావడంతో బీజేపీ ఎంపీలు పూర్తిగా నిస్తేజంలోకి వెళ్లిపోయారు. ఇక శత్రుఘ్నసిన్హా అయితే రాజస్థాన్ లో ప్రజలు బీజేపీకి ట్రిపుల్ తలాక్ ఇచ్చారని ట్వీట్ చేశారు. రాజస్థాన్ లో రెండు పార్లమెంటు స్థానాలు, ఒక అసెంబ్టీ స్థానం కోల్పోయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలుచేశారు. పార్టీని ఇలాగే నడిపితే వచ్చే ఎన్నికల్లో టాటా...బైబై...మాత్రమే మిగులుతుందని శత్రుఘ్నసిన్హా ఛలోక్తి విసిరారు.
పార్లమెంటరీ సమావేశంలోనూ....
ప్రతి మూడు, నాలుగు నెలలకొకసారి మోడీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోడీ ఎంపీల అభిప్రాయాన్ని తీసుకుంటారు. నియోజకవర్గాల్లో ప్రభుత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నదీ ఆరా తీయడం మోడీ నైజం. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన సమావేశంలో మాత్రం ఎంపీల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదని తెలిసింది. ఎబువంటి తాయిలాలు ప్రకటించకపోవడంతో ప్రజల్లోకి ఎలా వెళ్లాలని బీజేపీ ఎంపీలే మధనపడుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బడ్జెట్ సరైన దిశలో పెట్టకుండా తప్పు చేశారని కొందరు వ్యాఖ్యానించారని తెలిసింది.
మిత్రపక్షాలు కూడా....
అయితే కేవలం బీజేపీ ఎంపీలు లోలోపన బడ్జెట్ పై పెదవి విరుస్తుంటే మిత్రపక్షాలు మాత్రం బడ్జెట్ పై తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణ, మధ్యతరగతి ప్రజలను మెప్పించలేని బడ్జెట్ పెట్టి కూడా వృధానేనన్నది మిత్రపక్షాల అభిప్రాయం. రాష్ట్రాలు కూడా బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అయితే ఏకంగా తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయింది. తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కార్ కూడా బడ్జెట్ పై తీవ్ర విమర్శలే చేసింది. ఇలాగే వెళితే త్వరలో జరగనున్న కర్ణాటకలో కూడా బీజేపీకి గడ్డుకాలమేనని మిత్రపక్షాలు గట్టిగా చెబుతున్నాయి. మొత్తం మీద సబ్ కా సాథ్... సబ్ కా వికాస్ అని నినదించే మోడీ మాత్రం ఈ బడ్జెట్ లో మెరుపులు మెరిపించలేక పోయారని, తప్పుచేశారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.
- Tags
- మోడీ

