మోడీ పిలుపు కోసం బాబు...!

ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు భేటీకి అంగీకరించారు. రెండు మూడు రోజుల్లో చంద్రబాబుతో సమావేశమవుతానని హామీ ఇచ్చారు. అలాగే ఇప్పటి వరకూ ఏపీలో పరిష్కారానికి నోచుకోని సమస్యలను కూడా పరిష్కరిస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రధాని మోడీని ఏపీకి చెందిన టీడీపీ, బీజేపీ నేతలు కలిశారు. విభజన జరిగి నాలుగేళ్లవుతున్నా చట్టంలో పొందుపర్చిన అంశాలను పరిష్కరించలేదని ఎంపీలు మోడీ ఎదుట వాపోయారు. విభజన ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉందని, ఆదుకునే బాధ్యతను తీసుకోవాలని ఎంపీలు మోడీని కోరారు.
సానుకూల స్పందన......
ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని, అయితే ప్యాకేజీ నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ విడుదల చేయలేదని పేర్కొన్నారు. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకూ నిధులు విడుదల కాలేదన్నారు. విశాఖ రైల్వే జోన్ హామీ ఇంతవరకూ నెరవేర్చక పోవడంపైన కూడా ఎంపీలు ప్రధాని మోడీ వద్ద ప్రస్తావించారు. ప్రత్యేక సాయం కింద రాష్ట్రానికి 20,010 కోట్లు రావాల్సి ఉన్నా విడుదల కాకపోవడాన్ని గుర్తు చేశారు. అలాగే నియోజకవర్గాల పెంపు విషయాన్ని కూడా మోడీ వద్ద ప్రస్తావించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తాము ప్రజల్లోకి వెళ్లాలంటే హామీలు అమలుపర్చాలని వారు మోడీని కోరారు.
రెండు రోజుల్లో భేటీ.....
అయితే ఇందుకు ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఏపీకి అండగా ఉంటానని ప్రధాని భరోసా ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం అవుతానని మోడీ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. అలాగే మూడున్నరేళ్ల సమయం ఇంత ఫాస్ట్ గా గడిచిపోయిందా? అని మోడీ చిరునవ్వుతో ఎంపీలతో అన్నారు. తాను విభజన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని మోడీ తెలిపారు. త్వరలోనే చంద్రబాబుతో మోడీ సమావేశం కానున్నారు. దాదాపు ఏడాదిన్నరగా మోడీకి చంద్రబాబు అపాయింట్ మెంట్ దొరకలేదు. రెండు రోజుల్లో ప్రధాని కార్యాలయం నుంచి ఏపీ సీఎం చంద్రబాబుకు పిలుపు వస్తుందని ఏపీ టీడీపీ నేతలు చెబుతున్నారు.
- Tags
- మోడీ చంద్రబాబు

