మోడీ గారూ... ఆ..ఆలోచన మానుకోండి...!

ప్రధాని నరేంద్ర మోడీ జమిలి ఎన్నికల ఆలోచనలు మిత్రపక్షంలోని పార్టీలకే మింగుడుపడటం లేదు. జమిలి ఎన్నికలకు బీజేపీలోని భాగస్వామ్య పక్షాలే సిద్ధంగా లేవు. దేశంలో పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరగాలన్నది మోడీ ఆలోచన. దీనిపై వివిధ పక్షాలతో ఇప్పటికే ఆయన సంప్రదింపులు కూడా జరిపారు. జమిలీ ఎన్నికలపై ప్రధాని మోడీ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీనివల్ల ఎన్నికల వ్యయం తగ్గడంతో పాటు దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఫలితాలు వస్తాయన్నది బీజేపీ అంచనా. ఇందుకోసమే బీజేపీ జమిలీ ఎన్నికల కోసం పరితపిస్తోంది.
జమిలి ఎన్నికలకు వ్యతిరేకం....
అయితే జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు మిత్రపక్షాలు తమ వెంటే నడుస్తాయని భావించారు. అయితే ఊహించని విధంగా గత కొంతకాలం వరకూ శత్రుపక్షంగా ఉండి, ఇటీవలే మిత్రుడైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం జమిలీ ఎన్నికలను వ్యతిరేకించారు. ఆయన దీనిపై కుండబద్దలు కొట్టేశారు. పార్టీ అంతర్గత సమావేశంలో నితీష్ మాట్లాడుతూ దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న మోడీ కలలు నెరవేరవని నితీష్ చెప్పారు. ఈ ఆలోచనే సరికాదని ముఖ్యమంత్రి నితీష్ అభిప్రాయపడ్డారు.
మిత్రుల నుంచే వ్యతిరేకత....
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 2020 నవంబర్ నెల వరకూ సమయం ఉందని, ఈలోపు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏముందని నితీష్ ప్రశ్నించారు. అలాగే గుజారత్ ఎన్నికలు ఇటీవలే జరిగాయి. ఆ రాష్ట్రాన్ని కూడా తిరిగి ఎన్నికలకు తీసుకెళతారా? అని అడిగారు. తాను ఎట్టిపరిస్థితుల్లో మోడీ ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తి లేదని చెప్పారు. ఆచరణ సాధ్యం కాని ఆలోచనలను మోడీ మానుకోవాలని కూడా నితీష్ చెప్పారు. మరోవైపు లోక్ సభకు, రాష్ట్రాల ఎన్నికలకు జరిపితే వృధా ఖర్చు నివారించవచ్చని నీతి ఆయోగ్ కూడా అభిప్రాయపడింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే తాజాగా జమిలి ఎన్నికలపై మిత్రపక్షాల అభిప్రాయాన్ని కూడా ఈరోజు జరిగిన ఏన్డీఏ సమావేశంలో తీసుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తరుపున హాజరైన సుజనా చౌదరి, తోట నరసింహంలు మాత్రం తమ అధినేత చంద్రబాబు అభిప్రాయం తీసుకున్న తర్వాత తాము వెల్లడిస్తామని చెప్పారు. జమిలి ఎన్నికలపై రాష్ట్రపతి ప్రసంగంలో కూడా విన్పించడం విశేషం. మొత్తం మీద జమిలి ఎన్నికలకు వెళ్లాలని బేజీపీ తీవ్రంగానే ప్రయత్నాలు ప్రారంభించింది. మరి మిత్రపక్షాల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఎలా అధిగమిస్తారో చూడాలి.
- Tags
- నితీష్ కుమార్

