మోడీ ఏం చేసినా అందుకోసమేనా..?

ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనలో ఒక్క విషయం సుస్పష్టం చేశారు. ఎంతటి బిజీ షెడ్యూల్ వున్నా పార్టీ తరువాతే అంటూ క్యాడర్ కి సంకేతాలు పంపేలా ముందుగా వారితో భేటీ అయ్యారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. మెట్రో రైల్ ప్రారంభ కార్యక్రమానికి పది నిమిషాలే సమయం వెచ్చించిన మోడీ బేగంపేటలో టి బిజెపికి 15 నిమిషాలు కేటాయించారు. నీరసంగా వున్న తెలంగాణ బీజేపీలో జోష్ నింపారు. ఆయన ప్రసంగంలో దాదాపు నిమిషం పాటు తెలుగులో మాట్లాడి షాక్ కూడా ఇచ్చారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ ను గుర్తు చేస్తూ ...
తెలంగాణాలో ఎంఐఎం తో టిఆర్ఎస్ దోస్తు చేస్తున్న అంశం గ్రహించే ప్రధాని మోడీ హైదరాబాద్ పేరు చెప్పగానే సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరే గుర్తుకు వస్తుందని చెప్పడం ద్వారా తెలంగాణ విమోచన దినోత్సవం పై స్థానిక బిజెపి వాదనను సమర్ధించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఉత్సహంగా పనిచేయడానికి అవసరమైన దిశా నిర్దేశం చేస్తూనే ప్రధానిగా అన్ని రాష్ట్రాలు తనకు సమానమని టిఆర్ ఎస్ తో కలిసి ప్రయాణించడాన్ని కొంత వరకే తీసుకోవాలని చెప్పక చెప్పారు. హైదరాబాద్ విలీన యుద్ధంలో అమరుల త్యాగాలను గుర్తు చేస్తూ సెంటిమెంట్ సైతం రాజేశారు.
జీఈఎస్ ను ప్రచారం కోసం వాడేశారు ...
ప్రధాని మోడీ ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సును తమ పార్టీ ప్రచారానికి వేదికగా చక్కగా తన ప్రసంగాలతో మలిచారు. ప్రభుత్వం నల్లధనం కోసం సంస్కరణలు తెచ్చిందని, నోట్ల రద్దు ను డిజిటల్ కరెన్సీ దిశగా అడుగులు వేస్తున్నామని, సౌభాగ్య ద్వారా దేశంలో అందరికి విధ్యుత్ అంటూ జన్ ధన్ గొప్పతనాన్ని వివరించి తనకు ఏమి కావాలో ఎలా కావాలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గుజరాత్ ఎన్నికలకు, 2019 ఎన్నికల్లో తమ ప్రభుత్వం తిరిగి అధికారం లోకి రావాలిసిన అవసరాన్ని స్పష్టం చేశారు ప్రధాని. ఆయన ప్రసంగంలో గత మూడేళ్ళు అంటూ చెప్పుకోవడాన్ని అంతా గమనించారు. మొత్తం మీద హైదరాబాద్ పర్యటనకు రావడం వెనుక తన ఉద్దేశ్యాన్ని తేటతెల్లం చేశారు ప్రధాని.
- Tags
- మోడీ

