మోడీ అస్సలు ఊరుకోరు...!

ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టేందుకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే బోఫోర్స్ కుంభకోణాన్ని మరోసారి తెరపైకి తేవాలని ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా 2జీ కుంభకోణాన్ని కూడా తవ్వేందుకు సిద్ధమయింది. దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా పేరున్న 2జీ స్కాం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనికారణంగానే కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకపోయిందని కూడా చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతినడానికి కూడా ఈ కేసే కారణమని చెప్పకతప్పదు. మన్మోహన్ సింగ్ మౌనంగా ఉండబట్టే కుంభకోణాలు యధేచ్ఛగా జరిగాయని అప్పట్లో బీజేపీ నేతలు విమర్శలు చేసి మరీ అధికారంలోకి వచ్చారు.
2జీ కేసు మళ్లీ....
అయితే తాజాగా 2జీ కుంభకోణం కేసులో మాజీ కేంద్రమంత్రి రాజా, కనిమొళిని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు నిర్దోషులేనని సీబీఐ కోర్టు తేల్చింది. మొత్తం 17 మందిని ఈ కేసులో నిర్దోషులుగా తేల్చడంతో కాంగ్రెస్ బీజేపీ పై విరుచుకుపడింది కూడా. లక్షల కోట్ల కుంభకోణం అని చెప్పి ప్రజలను మభ్యపెట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇక బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి అయితే సీబీఐ కోర్టు తీర్పు వచ్చిన రోజే ఈ కేసులో నిందితులందరిపైనా ప్రభుత్వమే అప్పీల్ చేయాలంటూ కోరారు.
ఈ నెల 19వ తేదీన...
అయితే 2జీ కేసులో సీబీఐ తీర్పుపై సుప్రీంకోర్టులో అభ్యర్థన పిటిషన్ దాఖలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం నుంచి ఈమేరకు సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కార్యాలయాలకు ఆదేశాలు అందాయి. ఈ కేసులో వాదనలను విన్పించేందుకు అదనపు సోలిటర్ జనరల్ తుషార్ మెహతా పేరును స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సిఫార్సు చేయడం విశేషం. ఈ కేసులో ఇప్పటికే వాదిస్తున్న ఆనంద్ గ్రోవర్ స్థానంలో తుషార్ మెహతాను నియమించాలని నిర్ణయించారు. ఈనెల 19వ తేదీన 2జీ కేసు తీర్పుపై సీబీఐ పిటిషన్ దాఖలు చేసే అవకాశముందని ఢీల్లీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ కు మరోసారి 2జీ రుచి చూపించాలన్నది మోడీ ఆలోచనగా ఉంది.
- Tags
- 2జీ కుంభకోణం

