మోడీది ఇంత ప్రచార ఆర్భాటమా?

మోడీ ప్రచారంలో చూపిన శ్రద్ధ పాలనపై పెట్టడం లేదా? ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదా? నిజం... వాస్తవం. మోడీ మూడున్నరేళ్ల పాలనలో ప్రకటనల కింద ఖర్చు చేసింది ఎంతో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే. సమాచార హక్కు ద్వారా ఈవిషయం బయటపడటంతో విపక్షాలకు పెద్ద అస్త్రమే దొరికింది. ఈ మూడున్నరేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు పబ్లిసిటీ కింద 3,755 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసింది. దీంతో విపక్షాలు మోడీ తీరుపై మండి పడుతున్నాయి. ప్రచార ఆర్భాటమే కాని ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదనడానికి ఇదే ఉదాహరణ అని చెబుతున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడిచింది. ఈ మూడున్నరేళ్ల కాలంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, హోర్డింగ్స్ వంటి వాటికి వేల కోట్లు వెచ్చించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మూడేళ్లలో 3,750 కోట్లు....
కేంద్ర ప్రభుత్వం తాము ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పబ్లిసిటీ చేసుకోవడంలో తప్పులేదు. అయితే అవసరానికి మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తేనే విమర్శలకు తావిస్తుంది. ఇప్పుడు మోడీ అదే చేశారు. గతంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 526 కోట్లు ప్రకటనల కోసం ఖర్చు చేసింది. దీనిపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆమ్ ఆద్మీ సర్కార్ పై విరుచుకుపడ్డాయి. ఇప్పుడు అదే పనిని బీజేపీ చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, డిజిటల్, దూరదర్శన్, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ వంటి వాటిలో ప్రకటనల కోసం మూడున్నరేళ్లలో 3,755 కోట్లు ఖర్చు చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. దీనిపై మోడీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుజరాత్ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఇది బయటపడటం విశేషం.
- Tags
- మోడీ

