మోడీకి విషెస్ ఎందుకు చెప్పలేదు?

అలాంటి ఇలాంటి బంధం కాదు.. మూడున్నరేళ్ల కిందట పుట్టిన బంధం పెనవేసుకున్న బంధం.. అదే టీడీపీ బీజేపీ మైత్రి. ఎన్నికల్లో హాయిగా చెట్టపట్టాలేసుకుని తిరిగిన వారిరువురూ తరువాత కూడా అంతే ప్రేమ పంచుకున్నారు. ఒకరంటే ఒకరు అన్నట్లే ఉన్నారు. నాటి ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కూడా పెద్దగా జరిగిందేమీ లేకున్నా సుజనాలాంటి వారు పదవులు దక్కించుకున్నారు. అదే విధంగా కామినేని బాబు టీంలో చోటు దక్కించుకుని ఎంచక్కా సెటిల్ అయ్యారు. కానీ ఇంతలో ఏమైందో కానీ వీరి బంధం బలహీనపడుతూ వచ్చింది. పోలవరం విషయంలో వచ్చిన తగాదా కాస్తో కూస్తో ఎడం కు కారణమైంది.
మోడీకి అందుకే విషెస్ చెప్పలేదా?
కేంద్రం ఖర్చులు తగ్గించండంటే కొత్త కాంట్రాక్టుల పేరిట బాబు ఖర్చులు పెంచుతున్నారు. ఇదే మాత్రం పట్టించుకోవడం లేదు. ఏదో ఒకవిధంగా పనులు చేయించుకోవాలనే కానీ పాత కాంట్రాక్ట్ ని రద్దు చేసేదే లేదని తేల్చేస్తున్నారు. దీంతో పొడసూపిన భేదం ఇంకా ఇంకా కొన్నింట కొనసాగుతూనే ఉంది. అంతేకాక రెవెన్యూ లోటు భర్తీ విషయంలో కేంద్రం ఏపీ దుస్థితిని పట్టించుకోవడం లేదు. అమరాతి విషయంలోనూ అలానే ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మోడీకి నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలపలేదని తెలుస్తోంది. ముఖ్య నేతలకు న్యూఇయర్ విషెస్చెప్పిన బాబు ఎందుకనో మోడీ విషయంలో సైలెంట్ అయిపోయారు. ఇప్పుడిదే పలు అనుమానాలకు తావిస్తోంది.
ఆ రెండింటి లెక్కా తేల్చండి ....
పోలవరం ఒక్కటే కాదు ప్రత్యేక హోదాపైనా ప్రత్యేక రైల్వే జోన్ పైనా మాట్లాడాల్సింది ఎంతో! కానీ చంద్రబాబు అలా మాట్లాడకుండా ఉండిపో తున్నారు. ప్యాకేజీ కింద దక్కిందేమీ లేకున్నా ఏదో చేశామన్న బీజేపీ మాటలను ఖండించ లేకపోతున్నారు. ఓ విధంగా మిత్ర ధర్మంలో భాగంగా మాట్లాడలేకున్నా ఇదేమంత సమంజసం కాదన్న భావన పరిశీలకుల నుంచి వినవస్తోంది.ప్రత్యేక ప్యాకేజీ కింద కొంత మొత్తం నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్న కేంద్రం తరువాత దాని సంగతే మరిచిపోయింది. ఉత్తరాంధ్రకూ కొన్ని సీమకు కొన్ని నిధులు ఇచ్చినా వీటిని బాబు సక్రమంగా ఖర్చు చేయాలేకపోయారన్న అపవాదు ఉంది. దీంతో కేంద్రం బాబు అడిగే ఈ ఆర్థిక సంబంధిత వెసులుబాటుకూ సై అనడం లేదు. ఖర్చులు తగ్గించుకోమనే చెబుతుంది తప్ప ఇస్తామన్న వాటిపై శ్రద్ధ వహించడం లేదు.
జోన్ లేనట్లేనా....
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్ ఇంకా చర్చకు రాకున్నా దీనిపై ఒక్కటంటే ఒక్క మాట కూడా మోడీ చెప్పడం లేదు. ఏనాటి నుంచో ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ ఈ ప్రైవేటు మెంబర్ బిల్‌తో విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. కానీ విభజన బిల్లులో ఇదొక ప్రతిపాదనగా మాత్రమే ఉంది. స్పష్టంగా విశాఖకే జోన్ అన్నట్లు నాటి బిల్లులో ప్రస్తావించలేదు. దీంతో విభజన హామీలో భాగంగా జోన్ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలంటే అందుకు కేంద్రం మనసులో మాట ఏంటో అన్నది తెలుసుకోవడం ఒక్కటే దగ్గరి మార్గం. అందుకు ప్రైవేట్ మెంబర్ బిల్ పై చర్చ అత్యావశ్యకం. కానీ మోడీ ఇవ్వాలనుకుంటే బిల్లు ద్వారానే కాదు ఎలా అయినా ఇవ్వగలరు. కానీ రాజకీయ ప్రయోజనాల్లో భాగం ఇవ్వాల్సిందేదీ ఇవ్వకుండా ఒడిశాకు లోపాయికారిగా సహకరిస్తుంది.
ఇద్దరూ విఫలమయ్యారా?
ఈ నేపథ్యంలో చంద్రబాబు సైతం గట్టిగా పట్టుబట్టాల్సి ఉన్నా ఏమీ మాట్లాడ లేకపోతున్నారు. మొత్తంగా ఈ మూడు విషయాల్లోనూ (పోలవరం,ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్) కేంద్రం విఫలమైంది. కేంద్రం నుంచి హామీలు రాబట్టుకున్నా నిధులు రాబట్టుకోలేక బాబు అండ్ కో విఫలమైంది.అందుకే నిన్నటి వేళ బాబు మోడీని పలకరించకుండా కొత్త ఏడాది సందర్భంగా శుభాకాంక్షలు చెప్పకుండా సైలెంట్ అయిపోయి ఉండవచ్చు.
- Tags
- మోడీ చంద్రబాబు

