మే నెలలో కరెన్సీ నోటు దొరకదా?

తెలంగాణలో మే నెలలో కష్టాలు తప్పేట్లు లేదు. ఇప్పటికే గత కొద్ది రోజులుగా నోట్ల కొరత తెలంగాణ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తుంది. ఇక మే నెలలో ఒక్క కరెన్సీ నోటుకూడా దక్కని పరిస్థితి. ఇది ఎందుకంటే.... రైతులకు పెట్టుబడి కింద తొలి విడత మే నెలలో ఎకరానికి నాలుగు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అంద చేయనుంది. నేరుగా రైతులకు నాలుగు వేల రూపాయలు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనివల్ల తీవ్రమైన కరెన్సీ కొరత ఎదురు కానుందని బ్యాంకింగ్ వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నగదు రూపంలో రైతులకు పంపిణీ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం వల్లనే ఈ పరిస్థితి తలెత్తనుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఆరు వేల కోట్లు అవసరం.....
తెలంగాణ రాష్ట్రంలో కోటి నలభై లక్షల ఎకరాల్లో సాగు భూమి ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ భూములను సాగు చేస్తున్న రైతుల సంఖ్య 71 లక్షల మంది. వీరికి ఖరీఫ్ సీజన్ లో జూన్ నాటికి నాలుగు వేల రూపాయల పెట్టుబడిని నగదు రూపంలో పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అంచనా. అయితే ఇంత పెద్దమొత్తం నగదు బ్యాంకుల వద్ద లేదు. దీంతో తెలంగాణ సర్కార్ కేంద్ర ప్రభుత్వం సాయాన్ని కోరనుంది. అవసరమైన నగదును రాష్ట్రానికి పంపాలని విజ్ఞప్తి చేయనుంది.
ఇప్పటికే నగదు లేక....
పెద్ద నోట్ల రద్దు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో నగదు కొరత తీవ్రమైంది. ఏటీఎంలలో సయితం డబ్బులు పెట్టడం బ్యాంకులు మరిచిపోయాయి. ఇటీవల సంక్రాంతి పండగకు కూడా నగదు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగదును ప్రజలు బ్యాంకుల్లో్ డిపాజిట్ చేయకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తుతుందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. డిజిటల్ వినియోగం ప్రభుత్వం ఆశించినంత పెరగలేదు. ఎక్కువగా ప్రజలు నగదుపైనే ఆధారపడుతున్నారు. ఒకే నెలలో ఆరు వేల కోట్ల రూపాయల నగదును పంపిణీ చేయాలంటే కష్టమని బ్యాంకుల యాజమాన్యాలు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. జూన్ నెలలో ఖరీఫ్ కోసం నాలుగు వేలు, అలాగే అక్టోబర్ నెలలో యాసంగి కోసం మరో నాలుగు వేల నగదును ప్రభుత్వం రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది.
రిజర్వ్ బ్యాంకు నుంచి తెప్పించాలని...
ఇంత పెద్ద మొత్తాన్ని తాము పంపిణీ చేయలేమని బ్యాంకులు చేతులెత్తేయడంతో కేంద్రంతో మాట్లాడి రిజర్వ్ బ్యాంకు నుంచి ఆ మొత్తాన్ని బ్యాంకులకు తెప్పించాలన్నది ప్రభుత్వ ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే వారంలో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లు తమ వద్ద నగదు కొరత ఉందని స్పష్టం చేయడంతో ఇక ఢిల్లీకి వెళ్లి రిజర్వ్ బ్యాంకు సాయంతో ఆరు వేల కోట్ల కరెన్సీని తేవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మొత్తం మీద మే నెలలో కరెన్సీ కొరత తీవ్రమవుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
- Tags
- కరెన్సీ కొరత

