మెయిల్ ఫ్రం యూఎస్ : కొరియర్లో వస్తున్న డబ్బు కట్టలు!

పెద్దనోట్ల నిషేధం స్వదేశంలో ఆ డినామినేషన్లలో ఇళ్లలో డబ్బు కలిగి ఉన్న వారి మధ్య ఎంత స్థాయిలో సంచలనాలను సృష్టిస్తున్నదో, ప్రకంపనలను సృష్టిస్తున్నదో అంతే స్థాయిలో విదేశాలలో ఉన్న భారతీయుల్లో కూడా ఆందోళనలకు కారణం అవుతోంది. విదేశాలలో ఉండే భారతీయులు అక్కడ తమ వద్ద భారతీయ కరెన్సీ ఏ కొద్దిమొత్తాల్లో అయినా ఉంటే.. అది పూర్తిగా వృథా అయిపోకుండా.. వాటిని మార్చుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. వేరే గత్యంతరంలేని పరిస్థితుల్లో కొరియర్లో డబ్బు కట్టలను భారత్ లోని తమ బంధువులకు పంపి.. ఆ సొమ్మును తమ భారతీయ అకౌంట్లలో డిపాజిట్ చేయాల్సిందిగా కోరే పరిస్థితి ఏర్పడుతోంది.
సాధారణంగా యూఎస్, ఇతర విదేశాలలో ఉండే భారతీయులు.. ఎప్పుడైనా స్వదేశానికి వచ్చినప్పుడు విమానం దిగగానే చిల్లర అవసరాలకు డబ్బు ఉండదనే ఉద్దేశంతో కొద్ది మొత్తాల్లో ఇండియన్ కరెన్సీని విదేశాల్లో ఉన్నప్పుడు కూడా వెంటపెట్టుకునే అవకాశం ఉంటుంది. 20-30 వేల నుంచి 1-2 లక్షల వరకు వ్యక్తులు తమ వద్ద విడి సొమ్మును ఉంచుకోవడం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి వారు ఆ సొమ్మును ఇప్పుడు ఎలా మార్చుకోవాలో ఆందోళన చెందుతున్నారు.
అమెరికానుంచి డిసెంబరు 31 లోగా ఎవరైనా తమ మిత్రులు భారత్ కు వెళ్తోంటే వారి ద్వారి ఇండియాకు పంపి.. తమ అకౌంట్లలోకి వెళ్లే ఏర్పాటు చేసుకోవడం లేదా, కొరియర్ ద్వారా ఇండియాలోని తమ వారికి ఆ డబ్బును పంపి అకౌంట్లలోకి వేయమని చెప్పడం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఒక్కొక్క వర్గానికి చెందిన వారు ఒక్కొక్క మార్గాన్ని వెతుక్కుంటూ తమ వద్ద ఉన్న డబ్బును మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

