ముద్రగడను బయటకు వదలరా?

కాపు ఉద్యమ నేత ముద్రగడపై ఉక్కుపాదం మోపడాన్ని ఆ ప్రాంత నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ముద్రగడను ఇంటి నుంచి బయటకు రానివ్వక పోవడంపైన తీవ్రంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముద్రగడ ఆత్మీయ యాత్రకు బయలుదేరినా అడ్డుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ అధినేతజగన్ పాదయాత్రకు అనుమతి తీసుకున్నారా? తీసుకుంటే చూపించండి అని కాపు నేతలు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ముద్రగడ తొలుత పాదయాత్ర చేయాలనినిర్ణయించినా దాదాపు రెండు నెలలకు పైగానే ముద్రగడను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. కిర్లంపూడిలో పూర్తి స్థాయి బందోబస్తును నిర్వహించారు. వేలాది మంది పోలీసులను మొహరించారు. చివరకు పాదయాత్రను ముద్రగడ విరమించుకున్నారు. తిరిగి తన వర్గం నేతలతో సమావేశం అవ్వాలని ముద్రగడ భావించారు. దానికి ఆత్మీయ యాత్ర అని పేరుపెట్టుకున్నారు. కేవలం కోస్తా జిల్లాలో మాత్రమే ముద్రగడ పర్యటిస్తారని చెప్పారు కూడా.ః
రగలిపోతున్న కాపునేతలు....
అయినా ప్రభుత్వం అంగీకరించలేదు. దీనికి కూడా తమ అనుమతి తీసుకోవాల్సిందేననిచెప్పింది. గత ఐదు రోజులుగా ముద్రగడను ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదు. కిర్లంపూడి లో 144 సెక్షన్ అమల్లో ఉంది. ముద్రగడ ఇంటిచుట్టూ నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే టీడీపీ సర్కార్ మాత్రం కాపులంతా టీడీపీ వైపే ఉన్నారని చెబుతుందని, కాపులంతా టీడీపీకి మద్దతు తెలుపుతున్నప్పుడు ముద్రగడకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ముద్రగడను గృహనిర్భంధం చేయడంపై కాపు నేతలు ఫైరవుతున్నారు. తమ సమస్యలకోసం పోరాడుతున్ననేతపై అక్రమ నిర్భంధమేమిటంటున్నారు. ప్రభుత్వం నియంతలా మారిందని, ఇప్పటికైనా ముద్రగడ యాత్రకు అనుమతి ఇవ్వకుంటే త్వరలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామంటున్నారు కాపు నేతలు. ప్రభుత్వం మాత్రం అనుమతి తీసుకుని ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాల్సిందే అంటుంది. దీంతో ముద్రగడ సొంత గ్రామమైన కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
- Tags
- ముద్రగడ

