మీరు కాదు వారు మాట్లాడాలి సార్

పవన్ కల్యాణ్ అనంతపురం సభ పూర్తయిన తర్వాత.. తెలుగుదేశం పార్టీ భిన్నమైన తీరులో స్పందిస్తోంది. ఒకవైపు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ విమర్శలను పాజిటివ్ గా తీసుకోవాలని, ఆయన ఎత్తి చూపించిన పార్టీలోని లోపాల గురించి చర్చించుకుని.. అవి నిజమైతే చక్కదిద్దుకోవాలని చిలకపలుకులు పలికారు. మరోవైపు బాబూ రాజేంద్రప్రసాద్ లాంటి నాయకులు పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయదలచుకుంటే.. తమకు మిత్రపక్షంగా బరిలో ఉంటారో లేదా అవినీతి పరులతో చేయి కలుపుతారో తేల్చుకోవాలని ఒక ఫత్వా జారీచేశారు. తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ.. చాలా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా సైలెంట్ గా ఉంటున్న నెల్లూరు నాయకులు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పవన్ మీద మాత్రం విమర్శలు రువ్వారు.
జనసేన పార్టీ ఇంకా పూర్తి స్థాయి రాజకీయ పార్టీగానే ఎదగలేదని ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. పవన్ కల్యాణ్ తెదేపా మీద చేసిన విమర్శలకు కౌంటర్లు ఇచ్చారు. ప్యాకేజీ తీసుకోవడాన్ని సమర్థించారు.
ఇదంతా ఒక ఎత్తు .. అన్నిటినీ మించిన హైలైట్ ఏమిటంటే.. కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా త్వరలోనే చట్టబద్ధత రాబోతున్నదంటూ మాజీ రాష్ట్ర మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి ప్రకటించారు.
అయినా ఆనం రామానారాయణ రెడ్డి అంటే ఇప్పుడు కనీసం రాష్ట్రప్రభుత్వంలో ఎలాంటి బాధ్యత గానీ, కేంద్రంలో కనీసం ప్రమేయం గానీ లేని ఓ మామూలు నాయకులు మాత్రమే. అయితే ఆయన కేంద్రం చేయబోయే నిర్ణయం గురించి చాలా ధాటిగా ముందస్తు ప్రకటన చేసేస్తున్నారు. బిల్లు తానే తయారుచేసినంత ధాటిగా.. చట్టబద్ధత వచ్చేయబోతున్నదని సెలవిస్తున్నారు.
స్వయంగా చంద్రబాబునాయుడు, శంకుస్థాపన కార్యక్రమానికి అరుణ్ జైట్లీని ఆహ్వానించి సభా ముఖంగా.. ప్యాకేజీకి చట్టబద్ధత గురించి విన్నపాలు చేసుకుంటే.. జైట్లీ చంద్రబాబు హీరోయిజాన్ని పొగిడారే తప్ప.. అసలు ఆయన చేసిన డిమాండు చట్టబద్ధత ఊసెత్తలేదు. కనీసం రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏ చిన్న కాగితం వచ్చినా అది తన పుణ్యమే అని చెప్పుకుంటూ తిరిగే మరో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా చట్టబద్ధత గురించి ఏపీ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్ల గురించి తెలిసినా.. కనీసం ఆ ప్రస్తావన కూడా తన మాటల్లో రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎంత ఘోరంగా పరిస్థితి ఉన్నదంటే.. రాష్ట్రంలోని భాజపా నాయకులు కూడా చట్టబద్ధత గురించి కనీసం మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఎగవేసే సంకేతాలే అనేది స్పష్టం. అయితే తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నట్లుగా ఆనం రామనారాయణరెడ్డి మాత్రం.. చట్టబద్ధత పార్లమెంటు బిల్లుతో త్వరలో వచ్చేయబోతున్నదని చెబుతూ.. పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇవ్వడం కామెడీగా కనిపిస్తోంది.

