మిస్త్రీపై టాటా మరో దెబ్బ : టీసీఎస్ నుంచి కూడా తొలగింపు!

టాటా గ్రూపులో నెలకొన్న వివాదం ఇప్పట్లో సమసేలా కనిపించడం లేదు. నిజానికి గ్రూపు సంస్థల ఛైర్మన్ గా తొలగించబడిన సైరస్ మిస్త్రీకి, రతన్ టాటా అనుకూల యాజమాన్య ప్రతినిధులకు మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన మరింత పీటముడిగా బిగుసుకుంటున్న వాతావరణం ఉన్నదే తప్ప.. వ్యవహారం కొలిక్కి వచ్చేలా మాత్రం లేదు. టీసీఎస్ సంస్థలో ఉన్న పదవుల నుంచి కూడా గురువారం నాడు సైరస్ మిస్త్రీని తొలగిస్తూ టాటా గ్రూపు నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో ఇశాత్ హుసేన్ ను నియమించారు.
గురువారం నాడు వచ్చిన ప్రకటన ప్రకారం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ కు ఇకపై ఇశాత్ హుసేన్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. దీనికి అదనంగా టాటా సన్స్ యాజమాన్యం కంపెనీల చట్టం ప్రకారం.. అసాధారణ జనరల్ బాడీ సమావేశం నిర్వహించడానికి కూడా నోటీసు ఇచ్చింది. టీసీఎస్ సంస్థ డైరక్టర్ గా కూడా సైరస్ మిస్త్రీని తొలగించడం అనే అంశం మీద చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ కు కొత్త ఛైర్మన్ నియమితులయ్యే వరకు హుసేన్ ఆ స్థానంలో ఉంటారని ప్రకటనలో వివరించారు.
మిస్త్రీని టాటా సన్స్ గ్రూపు ఛైర్మన్ గా గత నెలలో తొలగించిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల కిందట మిస్త్రీ కి అవకాశం కల్పించిన రతన్ టాటానే ప్రస్తుతం తాత్కాలిక ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. మిస్త్రీ తొలగింపు నుంచి టాటా గ్రూపులో ప్రతిష్టంభన నడుస్తోంది.
వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ఇశాత్ హుసేన్ గతంలో టాటా స్టీల్స్, ఇండియన్ ట్యూబ్ కంపెనీ తదితర సంస్థల్లో సేవలందించారు. తాజా తొలగింపు ఉత్తర్వులతో మిస్త్రీలతో టాటా గ్రూపులో ఏర్పడిన ప్రతిష్టంభన మరింత ముదురుతుందని పలువురు భావిస్తున్నారు.

