మిత్రులే శత్రువులుగా మారుతున్నదెందుకు?

కమలదళంతో ఎవరూ కరచాలనం చేయలేకపోతున్నారు. ఆ పార్టీతో కలసి నడవలేకపోతున్నారు. అధికారంలోకి రాకముందు బీజేపీతో జత కట్టిన పార్టీలన్నీ వరుసగా ఒక్కొక్కటీ కూటమి నుంచి వెళ్లిపోతున్నాయి. ఇది కమలనాధులను కలవరపర్చే అంశమే. ఇప్పటికే మహారాష్ట్రలో మిత్రపక్షంగా ఉన్న శివసేన ఫ్రెండ్ షిప్ కు గుడ్ బై చెప్పేసింది. 2019 ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, మోడీ, అమిత్ షాల ఏకపక్ష ధోరణితోనే తాము కటీఫ్ చేప్పేశామని శివసేన బాహాటంగానే ప్రకటించేసింది.
బీహార్ లోనూ....
ఇక తాజాగా బీహార్ లో మిత్రపక్షంగా ఉన్న హిందుస్థానీ అవామ్ మోర్చా కూడా తలాక్ చెప్పేసింది. నిన్నటి వరకూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న హిందూస్థానీ అవామ్ మోర్చా ఎన్డీఏతో ఇక తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఈ విషయాన్ని ప్రకటించారు. దళితులను పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున తామను కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి మాంఝీతో ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి.
టీడీపీ సయితం....
ఇక పంజాబ్ లోని అకాళీ దళ్ కూడా బీజేపీ వైఖరి పట్ల పూర్తి అసంతృప్తితో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. పంజాబ్ లో వరుస ఘోర పరాజయాలకు బీజేపీ తో కలిసి నడవడమే కారణమని భావించిన శిరోమణి అకాళిదళ్ వీలయినంత త్వరగా మిత్ర బంధం నుంచి బయటపడాలని చూస్తోంది. ఇక దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న టీడీపీ కూడా కూటమికి రాం..రాం చెప్పాలన్న యోచనలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందన్న కారణాన్ని చూపి తెలుగుదేశం కూడా త్వరలోనే బీజేపీతో ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ను తెంచేయాలని చూస్తోంది. ఇలా వరుసగా ఒక్కొక్క మిత్రపక్షం మోడీ పార్టీని వదిలి వెళుతుండటం పార్టీ నేతలను కూడా ఆలోచనల్లో పడేసిందనే అంటున్నారు.
అవమానాలు ఎదుర్కొనలేకనేనా?
ముఖ్యంగా మిత్రపక్షాలకు కేంద్రంలో సరైన గౌరవం దక్కడం లేదన్నది ప్రధాన ఆరోపణ. కనీసం ముఖ్య నిర్ణయాల్లో సయితం తమను పక్కన పెట్టి తీసుకుండటం వారిని బాధిస్తోంది. నియంత పోకడలకు తాము వ్యతిరేకమంటూ ఒక్కొక్క పార్టీ వైదొలుగుతోంది. కేబినెట్లో ఉన్నప్పటికీ ఎటువంటి ముఖ్య సమాచారం ఇవ్వకుండా తమను అవమానపరుస్తున్నారన్నది మిత్రపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. మోడీ, అమిత్ షాలు ఇలాగే మొండిగా వెళితే స్నేహితులు మరికొందరు కూడా దూరమయ్యే అవకాశం లేకపోలేదు.
- Tags
- మోడీ

