మార్కెట్ గుత్తాధిపత్యంపై కన్నేసిన జియో

దేశీయ మొబైల్ రంగంలో ఉండే మార్కెట్ మీద గుత్తాధిపత్యం సాధించడానికి రిలయన్స్ జియో శ్రీకారం చుట్టింది. కేవలం 83 రోజుల వ్యవధిలో 5 కోట్ల మంది వినియోగదారులను పొందడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఫేస్ బుక్ , వాట్సప్ ల తరహాలో అంత వేగంగా కస్టమర్ బేస్ ను ఏర్పరచుకున్న మొబైల్ కంపెనీగా జియో రికార్డు సృష్టించింది. నిజానికి భారతదేశంలో మొత్తం పదికోట్ల మంది కస్టమర్లను లక్ష్యంగా పెట్టుకున జియో అధినేత ఆఫర్లను ప్రకటిస్తున్నారు. తొలుత డిసెంబరు 31 వరకు జియో సేవలు మొత్తం ఉచితం అంటూ ప్రకటించి మరో సంచలనం సృష్టించారు.
దేశీయ టెలికాం రంగంపై గుత్తాధిపత్యానికి రిలయన్స్ జియో సిద్ధమైనట్లే లెక్క. డేటా ఆధారంగా వాయిస్ కాల్స్ వెళ్లే కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తెచ్చిన జియో వినియోగదార్ల విషయంలో కొత్త సంచలనాలను నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉచితంగా ఇచ్చిన జియో సిమ్ లకోసం జనం ఎగబడి క్యూలైన్లలో నిల్చుని మరీ తీసుకున్నారు. ఇప్పుడు మార్చి 31 వరకూ ఉచితమే అని తేలడంతో జియో విజృంభణ ఇంకా ఉండబోతున్నదని అర్థమవుతోంది.

