మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్

విపక్షాలు తెగేసి చెప్పేశాయి. ఏదో మాటలు చెప్పి బుజ్జగించి.. సభను సజావుగా జరిపేసి.. తాము ఏ విషయం గురించి అయితే ఆందోళన చేస్తున్నామో ఆ అంశాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తే.. ఊరుకునేది లేదని ఇండైరక్టుగా స్పష్టం చేసేశాయి. నోట్ల రద్దుకు సంబంధించి ప్రజలకు ఎదురవుతున్న కష్టనష్టాలపై ఆందోళనలను ఉధృతం చేయడానికి విపక్షాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సమయంలో, వారితో మంతనాలు సాగించి, ఉద్యమాల బాటనుంచి పక్కకు మళ్లించడానికి కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. ఆందోళనల బాటలో ఉన్న విపక్షాలతో కేంద్ర హోం మంత్రి రాజ్నాధ్ సింగ్ సమావేశం ఏర్పాటుచేసుకుని, అందరినీ ఆహ్వానించగా.. ఆ భేటీకి వెళ్లడానికి వారు నిరాకరించారు.
రాజ్నాధ్ సింగ్ ఆధ్వర్యంలో జరగవలసి ఉన్న భేటీని పట్టించుకోని విపక్షనేతలు అందరూ గులాంనబీ ఆజాద్ ఆధ్వర్యంలో విడిగా సమావేశం అయ్యారు. ఇప్పటికే ఈనెల 28వ తేదీన భారత్ బంద్ నిర్వహించడానికి కాంగ్రెస్ మరియు విపక్ష పార్టీలు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. ప్రతిష్టంభన తొలగడం లేదు.
ముందస్తు ఏర్పాట్లు సక్రమంగా చేసుకోకుండా... ప్రజలను ఇలాంటి కష్టనష్టాలకు గురిచేసినందుకు ప్రధాని మోదీ జాతికి క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అలాగే క్యూలైన్లలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కూడా అంటున్నాయి. ప్రభుత్వం విపక్షాల దూకుడును తొలుత ఖాతరు చేయకపోయినప్పటికీ.. క్రమంగా వారి గళానికి బలం పెరుగుతూ ఉండడంతో మంతనాలకు సిద్ధపడింది గానీ.. ‘మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్’ అన్నట్లుగా ఆ బేటీకి రావడానికి విపక్షాలే నిరాకరించాయి.
ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ గురువారం రాజ్యసభకు హాజరై నోట్ల రద్దు విషయంలో విపక్షాలు లేవనెత్తుతున్న సందేహాలకు సమాధానం చెబుతారని కూడా అనుకుంటున్నారు.

