మాకు రఫ్పాడించే నేత కావలెను

ఏపీ బీజేపీ నేతలు రఫ్ఫాడించే అధినేతను కోరుకుంటున్నారు. సాధుస్వభావం కలిగిన వారు ఇప్పటి వరకూ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండటంతో ఏపీలో బీజేపీ ఎదగలేదు. దీంతో మెజార్టీ నేతలు దూకుడు స్వభావం ఉన్న నేతలనే అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా పార్టీ హైకమాండ్ కు తెలిపినట్లు తెలిసింది. ఏపీ బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు కూడా పెద్దగా ప్రయత్నించలేదన్న విమర్శలున్నాయి. అంతేకాకుండా అధికార పార్టీ తప్పొప్పులను కూడా హరిబాబు ఎత్తి చూపలేకపోతున్నారు. దీనివల్ల పార్టీ అధ్యక్షుడిని మార్చాలన్న డిమాండ్ ఏపీ బీజేపీలో ఊపందుకుంది. వాస్తవానికి హరిబాబు పదవీకాలం పూర్తయినా ఆయన్నే అధిష్టానం కొనసాగించడంపైన కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
హరిబాబు సీరియస్......
తనపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసిన నేతలపై కంభంపాటి హరిబాబు ఫైరవుతున్నారు. ఇటీవల కేంద్రమంత్రి గడ్కరీ పోలవరం సందర్శనకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రమంత్రులు ఎవరు వచ్చినా రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని సందర్శించాలన్న నిబంధనను జాతీయ పార్టీ పెట్టింది. పోలవరం సందర్శనకు వచ్చిన గడ్కరీ విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రానున్నారన్న సమాచారాన్ని కార్యాలయ సిబ్బంది అందరు నేతలకు తెలియజేశారు. ఈ సందర్భంగా కావూరి సాంబశివరావు, పురంధ్రీశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, గోకరాజు గంగరాజు వంటి నేతలు పార్టీ కార్యాలయానికి ముందుగానే వచ్చారు. అయితే అక్కడకు వచ్చిన హరిబాబు వేదికపై ఇన్ని కుర్చీలు అవసరంలేదని సిబ్బందికి చెప్పారట. తనకు, గడ్కరీకి మాత్రమే వేదికపై కుర్చీలు వేయాలని ఆదేశాలు జారీ చేయడంతో మిగిలిన సీనియర్ నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే హరిబాబు ఎందుకు ఫైర్ అయ్యారన్న విషయం నేతలకు అప్పడు అర్ధం కాలేదు. తర్వాత అర్థమయి మౌనం పాటించారట. అయితే ఇంతకూ గడ్కరీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రాకుండానే ఢిల్లీ వెళ్లిపోయారు. మొత్తం మీద ఏపీ బీజేపీ నేతల్లో లుకలుకలు కేంద్రమంత్రి పర్యటనలో బయటపడ్డాయని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.
- Tags
- బీజేపీ

