‘మహా’ ప్రయత్నాలతో రెండు ముసలాలు పుడతాయా?

ఉత్తరప్రదేశ్ లో మహా కూటమి ఏర్పాటుకోసం కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ అధినేతలతో కలిసి మంతనాలు సాగిస్తూ ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాగిస్తున్న ఈ మంతనాల పుణ్యమాని సమాజ్వాదీ పార్టీలో ముసలం పుట్టే ప్రమాదం పొడసూపుతున్నదని అనుమానాలు కూడా రేగుతున్నాయి. అఖిలేష్ ఈ మంతనాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పార్టీలో నివురుగప్పి ఉన్న వివాదాలు మళ్లీ రేగుతాయని.. మరో ముసలం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తాజా ట్విస్టు ఏంటంటే.. మహా కూటమి కోసం ప్రశాంత్ కిషోర్ చేస్తున్న ప్రయత్నాలు కేవలం ఎస్పీలో ముసలం పుట్టించడం మాత్రమే కాదు, ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా ముసలం పుట్టించే వాతావరణం కనిపిస్తోంది.
ప్రశాంత్ కిషోర్ ఉత్తర ప్రదేశ్ రాజకీయ సమీకరణాలకు సంబంధించి చేస్తున్న ప్రయత్నాలకు హైకమాండ్ అనుమతి ఉన్నదో లేదో కానీ.. ఆయన చర్యల గురించి, దూకుడుగా అనుసరిస్తున్న వైఖరి గురించి పార్టీలోనే చాలా మందికి తెలియదు అన్నమాట మాత్రం వాస్తవం. అదే సమయంలో.. పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి స్థాయి నాయకురాలు షీలా దీక్షిత్ కు సైతం ప్రశాంతి కిషోర్ చేస్తున్న ప్రయత్నాల గురించి కనీస సమాచారం లేదంటే.. అక్కడ సమన్వయ లోపం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. షీలాదీక్షిత్ ఒకవైపు ఈ మహా కూటమి ప్రయత్నాల పట్ల తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నారో మాకెవ్వరికీ తెలియదు.. అంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారు. పార్టీ వర్గాలు పేర్కొంటున్న దాన్ని బట్టి.. ప్రశాంత్ కిషోర్ నడుపుతున్న వ్యవహారాలను బట్టి.. పార్టీలో ఇప్పటికే రెండుగా నాయకులు చీలిపోయి ఉన్నట్లు తెలుస్తోంది. మరి రాహుల్ అండ్ కో ఎలాంటి వైఖరికి మద్దతిస్తుందో.. యూపీలో పొత్తులు పెట్టుకోడానికి జై కొడుతుందో లేదా ఒంటరిగా బరిలోకి దిగడానికి ఇష్టపడుతుందో చూడాలి.
రాహుల్ గాంధీ ఇంచుమించుగా పార్టీ సారథ్యం తానే చూస్తుండడం మొదలైన తర్వాత.. తొలిసారి వచ్చిన యూపీ- అతిపెద్ద రాష్ట్రం ఎన్నికలు ఇవి. ఇక్కడ పార్టీని ఎలా గట్టున పడేస్తారనేదానిపై వారి వ్యూహ చాతుర్యం మొత్తం ఆధారపడి ఉంటుంది. మరి రాహుల్ ఏ మేరకు తన సత్తా నిరూపించుకుంటారో చూడాలి.

