మరో వలస: గుడివాడ మీద తెదేపా పట్టు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. తాజాగా గుడివాడ మునిసిపల్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మరో ఏడుగురు కౌన్సిలర్లతో కలసి చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇన్నాళ్లుగా ఉన్నప్పటికీ.. జగన్ వ్యవహార సరళి నచ్చనందువల్లనే తెలుగుదేశంలోకి మారుతున్నట్లుగా యలవర్తి ప్రకటించడం విశేషం.
గుడివాడ మునిసిపల్ ఛైర్మన్ తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం అనేది ఆ పార్టీకి నియోజకవర్గంలో బలం సంతరించుకోవడానికి కొంత మేరకైనా తోడ్పడుతుందా అనేది చూడాలి. నందమూరి తారక రామారావు జన్మస్థలం ఉండే నియోజకవర్గం అయినప్పటికీ.. గుడివాడలో తెలుగుదేశం పార్టీ తన పట్టు చాటుకోలేకపోతోంది. అక్కడ ఎమ్మెల్యేగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఉన్నారు. ఆయనను తెలుగుదేశం పార్టీ ఓడించలేని పరిస్థితి ఉండడం విశేషం. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ గుడివాడ మీద పట్టు పెంచుకోవాలనే ప్రయత్నం ఆ పార్టీ చాలా కాలంగా చేస్తూ ఉన్నది.
వైకాపా నుంచి తెలుగుదేశం లోకి ఎమ్మెల్యేల వలసలు ముమ్మరంగా జరిగిన రోజుల్లో కొడాలి నాని కూడా పార్టీ మారబోతున్నారంటూ పుకార్లు ముమ్మరంగానే వచ్చాయి. అయితే నాని వాటిని కొట్టి పారేశారు. తనకు ప్రాణం ఉన్నంత వరకూ జగన్ వెంటే ఉంటానంటూ తెగేసి చెప్పారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలోని మిగిలిన వైకాపా నాయకులపై దృష్టి పెట్టినట్టుగా ఉంది. చివరికి వారి గేలానికి మునిసిపల్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పడ్డారు. ఆయనతో పాటూ కౌన్సిలర్లు కూడా పార్టీ మారడంతో గుడివాడ మునిసిపల్ పీఠాన్ని తెలుగుదేశం దక్కించుకోవడం సాధ్యం కావచ్చు.
అయితే అభివృద్ధి పనుల పేరిట బ్లాక్ మెయిల్ చేస్తూ తెలుగుదేశం నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నదనే విమర్శలకు పాలకపక్షం మరో మారు ఆస్కారం కల్పించినట్లయింది. నాయకులు ఫిరాయించినంత మాత్రాన జనంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు ఉన్న బలాన్ని వీరు దెబ్బతీయగలరా అనేది చర్చనీయాంశంగానే ఉంది.

