మందకృష్ణ వెనక ఆ పార్టీ ఉందా..!

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం ఎన్నో ఏళ్ళుగా ఉద్యమిస్తున్న ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్నారా..? తెలంగాణలో ఆయన అరెస్టు, ఇప్పటికీ విడుదల కాకపోవడానికి కారణం అదేనా ? తెలంగాణ లో మందకృష్ణను బలహీన పర్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందా..? అంటే అవుననే అని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ పలుమార్లు టీడీపీకి, కాంగ్రెస్ కు దగ్గరగా ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆయా పార్టీలకు మద్దతు ఇచ్చారు.
ఢిల్లీకి అఖిలపక్షం...
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అయితే కొన్నాళ్ళుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తోంది. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరుతోంది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై మందకృష్ణ విమర్శలు. గుప్పిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఎమ్మార్పీఎస్ నాయకులు మాత్రం మందకృష్ణ. తీరుపై మండిపడుతున్నారు.
టీఆర్ఎస్ కు అనుకూలంగా ఒక వర్గం...
వంగపల్లి శ్రీనివాస్ నేతృత్వంలోని టీఎమ్మార్పీఎస్ నాయకులు తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. నేపథ్యంలో మందకృష్ణ మాదిగ బీజేపీకి దగ్గరగా ఉంటున్నారని, ఆయనను ముందునిలిపి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి బలపడడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పై ఆందోళన చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికీ ఆయన విడుదల కాలేదు. దీని వెనుక తెలంగాణ ప్రభుత్వం కుట్ర ఉందని, మందకృష్ణను, ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తోందని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
వర్గీకరణ కోసం ఎవరి దగ్గరికైనా...
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కు అనుకూలంగా ఉన్నా మందకృష్ణ బీజేపీతో కుమ్మక్కు అయ్యారని, ఆయన తీరుతో ఉద్యమానికి ఉన్న సామాజిక మద్దతు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని టీ ఎమ్మార్పీఎస్ నేతలు మండిపడుతున్నారు. మందకృష్ణ మాత్రం వర్గీకరణ కోసం ఎవరి దగ్గరకైనా వెళ్తానని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఉద్యమం ఆగదని అంటున్నారు. మరి అసలు లోగుట్టు ఏంటో మందకృష్ణకే తెలియాలి.
- Tags
- మందకృష్ణ

