మందు కొట్టి.. అర్ధరాత్రి.. టీడీపీ ఎమ్మెల్యేల వీరంగం.. !

ఏపీ అధికార పార్టీ టీడీపీ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వీరంగం సృష్టించారు. అది కూడా మందు తాగి చిందులేశారు. ఎంతో క్రమ శిక్షణ గల టీడీపీలోనే ఇలా జరగడం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో చూపించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నిన్న ప్రాజెక్టు ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ కార్యక్రమం చాలా హుషారుగా సాగింది.
మందు కొట్టి చిందులేస్తూ...
అనంతరం, ఈ ఎమ్మెల్యేలబృందాన్ని విశాఖ పట్నం తీసుకువెళ్లారు. అక్కడ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అగ్రి సదస్సు పరిశీలించి, రాష్ట్రంలో రైతులకు అనుకూలమైన పంటల వాతావరణం కల్పించాలని నిర్ణయించారు. దీనికిగాను ఎమ్మెల్యేలు సదస్సును వీక్షించే ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం శుక్రవారం జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలను విశాఖ పట్నం తీసుకువెళ్లారు. అయితే, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఫూటుగా తాగి చిందులు వేసినట్టు వార్తలు వచ్చాయి. నోవాటెల్ హోటల్ దగ్గరకు గురువారం అర్ధరాత్రి వచ్చి తమకు గదులు కావాలంటూ సిబ్బందిపై చిందులు చేశారు.
హోటల్ గది ఇవ్వలేదని....
అయితే.. ఎమ్మెల్యేలకు మరో హోటల్లో గదులు కేటాయించామని అధికారులు చెప్పినా వినకుండా తమకు నోవాటెల్లోనే గదులు కావాలంటూ హుకుం జారీ చేశారు. ఆ సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఫూటుగా మద్యం సేవించి ఉన్నారని సమాచారం. కాగా... గత్యంతరం లేక హోటల్ నోవాటెల్లోనే గదులను సర్ధుబాటు చేశారు. ఓ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి చిత్తుగా మద్యం తాగి హోటల్ సిబ్బందిపై ఎమ్మెల్యేలు చిందులేయడంపై పలు విమర్శలొస్తున్నాయి. మరి దీనిపై సీఎం చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదేమైనా టీడీపీకి ఈ పరిణామం మచ్చ తెస్తుందని అంటున్నారు.
- Tags
- టీడీపీ

