మంత్రులు గైర్హాజరు...బాబు కీలక నిర్ణయం?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఏపీ బడ్జెట్ ను ఆమోదించేందుకు సమావేశమైన కేబినెట్ సమావేశానికి బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు గైర్హాజరయ్యారు. బీజేపీకి చెందిన దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేనిశ్రీనివాస్ లు ఇద్దరూ హాజరు కాలేదు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. నిన్న అర్థరాత్రి కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలుగునున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరికాసేపట్లో బీజేపీ మంత్రులు.....
అయితే చంద్రబాబు ప్రకటన వెలువడిన వెంటనే విజయవాడలోని ఐలాపురం హోటల్ లో బీజేపీ నేతలు కూడా సమావేశమయ్యారు. కేంద్ర నాయకత్వంతో మాట్లాడారు. కేంద్రం నుంచి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ వైదొలగడంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తమ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఇద్దరు మంత్రులు రాజీనామాలు సమర్పించాలని నిర్ణయించారు.
ఈ కేబినెట్ సమావేశంలో....
అయితే ప్రస్తుతం జరుగుతున్న కేబినెట్ సమావేశంలో కూడా తాజా రాజకీయ పరిణామాలను చర్చించనున్నారు. కేంద్రమంత్రి వర్గం నుంచి సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు ఈరోజు రాజీనామా చేయనున్నారు. రాజీనామాలు లేఖలు సమర్పించిన వెంటనే ప్రధాని మోడీ నుంచి స్పందన వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశిస్తున్నారు. నిన్న రాత్రి ప్రధానితో మాట్లాడాలని చంద్రబాబు ప్రయత్నించినా వీలు చిక్కలేదు. దీంతో ఆయన ఈరోజు స్పందించే అవకాశముందని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రధాని స్పందనను బట్టి.....
ప్రధాని స్పందనను బట్టి ఎన్డీఏలో కొనసాగాలా? లేదా? అన్నది టీడీపీ నిర్ణయించనుంది. దీనిపై కూడా కేబినెట్ సమావేశంలో చంద్రబాబు మంత్రివర్గ సహచరులతో చర్చించనున్నారు. బీజేపీ తమను కావాలనే బయటకు పంపిందనే అనుమానం టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తాము గొంతెమ్మ కోర్కెలు కోరకపోయినా అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు ఏపీ ప్రజలను అవమానపర్చే విధంగా ఉన్నాయని చంద్రబాబు భావించారు. అందుకోసమే నాలుగేళ్లుగా కొనసాగుతున్న బంధాన్ని తెంచుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే తాము ఊరుకోబోమన్న సంకేతాలను టీడీపీ ఇచ్చినట్లయిందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద కేబినెట్ సమావేశంలో దీనిపైనే ఎక్కువగా చర్చ జరిగే అవకాశముంది.
