మంత్రి గంటా...పై చంద్రబాబు సీరియస్

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా విదేశీ ప్రయాణంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు విదేశీ పర్యటనలేంటని ఆయన అసహనం చెందారు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష కు గంటా శ్రీనివాసరావు హాజరుకాలేదు. ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారని అధికారులు తెలపడంతో ముఖ్యమంత్రి ఒకింత అసహనం చెందారు. తాను విదేశీ పర్యటనకు 9 రోజుల పాటు వెళ్లి వచ్చినా... గంటా శ్రీనివాసరావు బృందం ఇంకా రాకపోవడమేంటని ప్రశ్నించారు. ఇన్ని రోజులు విదేశాల్లో పర్యటిస్తే ఎలా అని అన్నారు. తాను చెప్పిన ఏ పనిని సక్రమంగా చేయడం లేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తమాషా చేస్తున్నారా...?
విద్యాశాఖపై తాను ఎంత సీరియస్ గా ఉన్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు.విద్యార్థులను ఓడీఎఫ్ లో భాగస్వామ్యులను చేయాలని ఎన్ని రోజుల నుంచి తాను చెబుతున్నా అధికారులకు శ్రద్ధ లేకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో మరుగుదొడ్లు నిర్మించాలని... తాను చెప్పానని అది ఎంతవరకూ వచ్చిందని చంద్రబాబు ఆరా తీశారు. దీనికి కూడా అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తమాషాలు చేస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు తమ వద్ద నిధులు అందుబాటులో లేవన్న విషయాన్ని చెప్పలేకపోయారు.

