మండే వైసీపీకి బ్యాడ్ డే...!

వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే టీడీపీలోకి చేరేందుకు రెడీ అయిపోయారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం లోకి చేరాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని రోజులుగా గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే గిడ్డి ఈశ్వరిని బుజ్జగించేందుకు స్వయంగా వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారు. ఆయన విశాఖపట్నంలో ఉండి గిడ్డి ఈశ్వరితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కాని గిడ్డి ఈశ్వరి మాత్రం రహస్య ప్రాంతానికి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆమె అనుచరులను మాత్రం విజయవాడకు ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు చంద్రబాబు సమక్షంలో గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరనున్నారు.
నేడే ఈశ్వరి టీడీపీలో చేరిక.....
గిడ్డి ఈశ్వరి తనకు వ్యతిరేకంగా కొందరిని వైసీీపీలో చేర్చుకోవడంపై కినుక వహించారు. అందుకే ఆమె గత కొన్ని రోజులుగా గూడెం కొత్త వీధి, చింతపల్లి, కొయ్యూరు ప్రాంతాల్లో అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని పార్టీలోకి తీసుకువస్తుడంటంతో ఇక వైసీపీలో ఉండటం వేస్ట్ అని అనుచరులు కూడా ఈశ్వరికి గట్టిగా చెప్పారు. దీంతో ఈశ్వరి పార్టీ మారేందుకే నిర్ణయించుకున్నారు. ఈశ్వరిని వచ్చే ఎన్నికల్లో అరకు ఎంపీగా పోటీ చేయాలని అధిష్టానం చెప్పడం, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, మాజీ మంత్రి బాలరాజులను పార్టీలోకి తీసుకువస్తుండటాన్ని ఈశ్వరి జీర్ణించుకోలేకనే పార్టీని వీడుతున్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు. మొత్తం మీద ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బే.
- Tags
- వైసీపీ

