బ్లాక్ 2 వైట్ : టీవీ ఛానెల్స్ సలహా చెప్పేస్తున్నాయ్

నల్లకుబేరులు అంటే కేవలం వందల వేల కోట్ల అక్రమ ధనం కలిగి ఉన్న వారు మాత్రమే కాదు. ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో చూపించకుండా నాలుగైదు లక్షలు ఎవరైనా కలిగి ఉన్నా సరే.. అదంతా నల్లధనం కిందే లెక్క. సాధారణంగా మధ్య, ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లో జనం వద్ద కొన్ని లక్షల మేరకు పన్నులెక్కల పరిధిలో లేని మొత్తం ఉంటుందని అనుకోవచ్చు. అలాంటి వారంతా కూడా.. ఇప్పుడు సతమతం అవుతున్నారు. నలభై యాభై లక్షల మేరకు లెక్కల్లో లేని సొమ్ము ఉన్న వాళ్లు దాన్ని ఎలా కాపాడుకోవాలా? అని కిందా మీదా అయిపోతున్నారు.
అయితే టీవీ ఛానెళ్లలో పెద్దనోట్ల రద్దు పరంగా ఎదురవుతున్న ఇబ్బందులపై ఆర్థిక నిపుణులతో వరుసగా చర్చావేదికలు నడుస్తూనే ఉన్నాయి. దాదాపుగా అన్ని ఛానెళ్లలో ఇవే చర్చలు జరుగుతున్నాయి. కొన్ని ఛానెళ్లలో అయితే డిస్కషన్లలో ప్రముఖులు బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునే మార్గాలు బహిరంగంగా చెప్పేస్తున్నారు.
‘‘మీ వద్ద 40 లక్షలున్నాయా.. మీ మిత్రులు, కుటుంబసభ్యులు ఇలాంటి అకౌంట్లలో అకౌంటుకు 2.5 లక్షల చొప్పున వేసుకోండి.. తర్వాత తీసుకోండి.. అంతా వైట్ అవుతుంది..‘‘ అంటూ సలహాలు ఇస్తున్నారు. ఇందులో మళ్లీ కామెడీ ఏంటంటే.. ఇలా చిన్న మొత్తాల్లో నల్లధనం కలిగి ఉండే లక్షలాది మంది పౌరుల్లో ... మోదీ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఉండేందుకే తాము ఇలాంటి సలహాలు చెబుతున్నాం అంటూ వారు సెలవిస్తున్నారు. అయినా.. బ్లాక్ 2 వైట్ దొంగమార్గాలను కూడా అధికారికంగా టీవీ ఛానెళ్లే చెప్పేస్తోంటే.. ఇక ఎవరు మాత్రం చేసేదేముంది.

