బ్రేకింగ్ : లోక్ సభ ఎప్పటిలాగానే రేపటికి వాయిదా

వాయిదా అనంతరం లోక్ సభ తిరిగి ప్రారంభమయింది. అయితే అన్నాడీఎంకే సభ్యుల ఆందోళనలు ఆగలేదు. ఉదయం 11గంటలకు ప్రారంభమయిన లోక్ సభ అరనిమిషానికే వాయిదా పడింది. తిరిగి 12 గంటలకు ప్రారంభమైన లోక్ సభలో అన్నాడీఎంకే సభ్యులు తమ ఆందోళనలు విరమించలేదు. కాంగ్రెస్ అవిశ్వాసానికి మద్దతిస్తే ఆందోళనలు విరమిస్తామని నిన్న చెప్పిన అన్నాడీఎంకే మాట మార్చింది. సభలో ఆందోళనలు కొనసాగించింది. ఆందోళనల మధ్యనే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలో నివేదికలను ప్రవేశ పెట్టారు. కావేరి బోర్డును వెంటనే ఏర్పాటుచేయాలంటూ అన్నాడీఎంకే సభ్యులు నినదిస్తూనే ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి సహకరించాలని అన్నాడీఎంకే సభ్యులను విపక్షాలు కోరినా వారు విన్పించుకోలేదు. స్పీకర్ సుమిత్రా మహాజన్ అవిశ్వాస తీర్మానం నోటీసులు చదివి విన్పించారు. అవిశ్వాసం తీర్మాన నోటీసులుపై హెడ్ కౌంట్ చేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేవంటూ స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేశారు. అవిశ్వాసంపై చర్చకు సిద్ధమని, చర్చకు సహకరించాలని మంత్రి అనంతకుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా అవిశ్వాసంపై చర్చను చేపట్టాలని కోరారు. అయినా వారు విన్పించుకోలేదు. దీంతో అన్నాడీఎంకే సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఆందోళనలు ఆగకపోవడంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.
