బ్రేకింగ్ : టీడీపీపై కాటమరాయుడు నిప్పులు...!

టీడీపీ, బీజేపీలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైరయ్యారు. తొలిసారి ఆయన టీడీపీపై నేరుగా విమర్శలు చేశారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారు. వారికి మద్దతు ప్రకటించేందుకు ఈరోజు విశాఖ చేరుకున్న పవన్ వారి దీక్షలో పాల్గొన్నారు. తొలుత ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్ కుటుంబాన్ని పరామర్శించారు. వారిని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నైతిక మద్దతు ఇవ్వడానికే తాను వచ్చానని పవన్ చెప్పారు. మీ బాధలు పంచుకోవడానికే వచ్చానన్నారు. లాభాల బాటన నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు సంస్థలకు అప్పగించడమేంటని పవన్ ప్రశ్నించారు. లాభాల బాటలో ఉన్న డీసీఐను ఎలా ప్రయివేటీకరిస్తారన్నారు. నష్టాల్లో ఉన్నవాటిని ప్రయివేటు పరం చేస్తే తప్పులేదని, లాభాల్లో ఉన్నవాటిని ప్రయివేటు పరం చేయడమెందుకన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజాసమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడుతూనే ఉన్నానన్నారు. రాజకీయ జవాబుదారీ తనం కావాలన్నారు. ప్రజాసమస్యలు తీసుకెళ్లలేని మీకు మళ్లీ పోటీచేసే హక్కు లేదన్నారు. కడుపు మండి మాట్లాడుతున్నానన్నారు.
టీడీపీ, బీజేపీలకు ఓటు అడిగే హక్కు లేదు....
నాలుగు సంవత్సరాలు ఓపిక పట్టానని, ఏదో అద్భుతం జరిగుతుందని భావించానన్నారు. ఈరోజుకూ విభజన సమస్యలను వెంటాడుతూనే ఉన్నాయి. టీడీపీ, బీజేపీలకు వచ్చే ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. తాను ఏ పార్టీకి కొమ్ముకాయడం లేదని, తాను ప్రజాపక్షమని కుండబద్దలు కొట్టేశారు. దేశాన్ని అభివృద్ధిచేసుకోవాలంటే సేవ చేసే నాయకులు కావాలన్నారు. సమస్యల నుంచి తాను ఎప్పుడూ పారిపోనన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎదిరిస్తే తనను ఏం చేస్తారని ప్రశ్నించారు. తనకు భయం లేదన్నారు. మేనిఫేస్టోలో చేసిన వాగ్దానాలను అమలుపర్చాలని కోరుతున్నానన్నారు. తనకు ప్రాణాలు లేవని ధైర్యం ఉందన్నారు. జనం కోసం జైలుకెళ్తాను లాఠీ దెబ్బలు తింటానని పవన్ చెప్పారు. ప్రజాసమస్యల కోసమే పార్టీ పెట్టానన్నారు. తనకు ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కావాలని ఎన్నడూ లేదన్నారు.డీసీఐను ప్రయివేటు పరంగా చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకోవాలని పవన్ కోరారు. తాను టీడీపీ పక్షంకాదని, బీజేపీకి చెందిన వాడిని కానని మరోమారు పవన్ స్పష్టం చేశారు. ఎంపీలు హరిబాబు, అవంతి శ్రీనివాసులు లాగా తాను బాద్యతను మర్చిపోనన్నారు. ఎవరు తప్పు చేసినా నిలదీస్తానన్నారు. పదవులపై తనకు ఆశలేదన్నారు. డీసీఐ విషయంపై ప్రధానికి లేఖ రాస్తానని చెప్పారు. డీసీఐని ప్రయివేటీకరిస్తే బీజేపీ పతనం విశాఖ నుంచే ప్రారంభమవుతుందన్నారు. ప్రజలకు నచ్చని ఏపార్టీకీ మద్దతివ్వబోనన్నారు. 2019 ఎన్నికలు వస్తున్నాయని, ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నష్టపోతారన్నారు.
- Tags
- పవన్ కల్యాణ్

