బ్రేకింగ్ : అసెంబ్లీలోనే టీడీపీ ఎమ్మెల్యే వంశీ రాజీనామా ?

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. డెల్టా షుగర్స్ విషయంలో సీఎంవో తీరుకు నిరసనగా వంశీ రాజీనామా చేశారు. డెల్టా షుగర్స్ ఫ్యాక్టరీని హనుమాన్ జంక్షన్ నుంచి తణుకు ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే డెల్టా షుగర్స్ ను తరలించవద్దంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు రైతులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చంద్రబాబును కలిసేందుకు వల్లభనేని వంశీ వచ్చారు. అయితే ఇందుకు సీఎంవో అధికారులు అంగీకరించలేదు.
సీఎంవో అధికారుల తీరుకు నిరసనగా....
దీంతో వల్లభనేని వంశీ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖను అందించాలని వంశీ ప్రయత్నించారు. అయితే పక్కనే ఉన్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆ రాజీనామా లేఖను వెంటనే చించేశారు. అయితే వంశీ నిరసనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు రంగంలోకి దిగారు. వంశీని సముదాయించే ప్రయత్నం చేశారు. లోకేష్ కూడా రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఎమ్మెల్యేల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే తప్పుపడుతున్నారు.

