బ్యాంకుల మీద ధ్వజమెత్తిన చంద్రబాబు

నోట్ల రద్దు నేపథ్యంలో నోట్ల మార్పిడి వ్యవహారం అమల్లోకి వచ్చిన నాటినుంచి బ్యాంకులు నానా విధాలుగా మాల్ ప్రాక్టీసెస్ కు పాల్పడుతూనే ఉన్నాయి. సామాన్యులను బయట కిలోమీటర్ల పొడవున క్యూలైన్లలో నిల్చోబెట్టి.. దొడ్డిదారిని కోట్ల రూపాయల కొత్తనోట్లను తరలించేసి.. నల్లకుబేరులకు అడ్డగోలుగా సహకరించిన బ్యాంకులు కూడా ఉన్నాయి. జనం కష్టాలు, అవసరాలు తమకేమీ పట్టనట్లుగా నిర్లిప్తంగా వ్యవహరించిన బ్యాంకులు కూడా ఉన్నాయి. అయితే ఏపీ ముఖ్యమంత్రి నోట్లకష్టాలు ప్రారంభమైన తొలిరోజునుంచి కూడా దాదాపుగా ప్రతిరోజూ బ్యాంకర్లతో కూడా కలిపి సమీక్ష సమావేశాలు పెట్టుకుంటూనే ఉన్నారు. ఎంత చేసినా సరే, బ్యాంకర్లు ఒక పట్టాన ఆయన ఆదేశాలకు లొంగి రాలేదన్న మాట వాస్తవం. పలు సందర్భాల్లో ఆయన బ్యాంకర్లు వ్యవహరిస్తున్న తీరు మీద అసహనం వ్యక్తం చేశారు కూడా!
ఇప్పుడు డిజిటల్ లావాదేవీలు పెంచే సూచనలకోసం ఏర్పాటు అయిన ఉన్నతస్థాయి సీఎంలు, అధికారుల కమిటీకి సారథ్యం వహిస్తున్న చంద్రబాబు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన తొలి సమావేశంలో అధికారికంగా బ్యాంకర్ల తీరు మీద మళ్లీ ధ్వజమెత్తారు. కొన్ని బ్యాంకులు స్వార్థంతో వ్యవహరిస్తున్నాయని, ఈ పోకడ సరికాదని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.
ప్రధానంగా ఈ సమావేశంలో రిజర్వు బ్యాంకు నుంచి విడుదల అవుతున్న నిధులపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తోంది. డిజిటల్ లావాదేవీలు పెంచడానికి సభ్యులనుంచి సూచనలు ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు, ఏపీలో చేపడుతున్న చర్యల గురించి ప్రత్యేకంగా మిగిలిన వారికి కూడా వివరించినట్లు తెలుస్తోంది.
మొత్తానికి చంద్రబాబునాయుడు సారథ్యంలోని కమిటీ డిజిటల్ లావాదేవీల గురించి కేంద్రానికి సూచనలు చేయడానికి నిర్దిష్టమైన డెడ్లైన్ ఏదీ కేంద్రం విధించలేదు. అయితే అలాగని అలవిమాలిన జాప్యం చేయకుండా.. వీలైనంత త్వరగా ప్రజల కష్టాలు దూరం కావాలంటే.. వారు తమ సిఫారసులు చేయడం మాత్రమే కాకుండా, వాటిని కార్యరూపంలోకి తేవాలని జనం కోరుకుంటున్నారు.

