బీజేపీ సక్సెస్ అయిందే...!

తెలంగాణ బీజేపీ సక్సెస్ అయింది. ప్రధాని మోడీ పర్యటనను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధించింది. ఇందులో బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రముఖ పాత్ర పోషించారు. ప్రధాని మోడీ టూర్ ను టీఆర్ఎస్ హైజాక్ చేస్తుందని ముందుగానే గ్రహించిన బీజేపీ నేతలు అందుకు అనుగుణంగా పావులు కదిపారు. మోడీ అధికార పర్యటనకు వస్తున్నప్పటికీ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు. గత కొన్ని రోజుల నుంచి ప్రధాని మోడీ పర్యటన బీజేపీకి టెన్షన్ పట్టుకుంది. మోడీ వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంతా తానే అయి వ్యవహరిస్తారని, అధికార పార్టీకి మైలేజ్ వచ్చేలా ప్రధాని పర్యటన ప్లాన్ చేస్తారని భావించిన బీజేపీ ఇందుకోసం పకడ్బందీ ప్లాన్ చేసింది. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అనేకసార్లు అమిత్ షా తో ఫోన్లో మాట్లాడారు. ప్రధాని పర్యటనలో పార్టీ సమావేశం ఉండేలా చూడగలిగారు.
కేసీఆర్ ఆలోచనలకు చెక్ పెట్టి....
అందుకోసం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ ను ఎంచుకున్నారు. ప్రధాని స్వాగత కార్యక్రమం అని పేరుపెట్టినా హైదరాబాద్ లోని ఐదు నియోజకవర్గాల నుంచి సుమారు ఐదు వేల మంది బీజేపీ కార్యకర్తలను ప్రధాని పర్యటనకు రప్పించారు. బేగంపేట విమానాశ్రయాన్ని కాషాయమయం చేశారు. ప్రధాని మోడీ వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం... రెండు నిమిషాలు తెలుగులోనే మాట్లాడటం ఆ పార్టీకి ప్లస్ పాయింట్ అయిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్మరించి నిజాం వ్యతిరేకులను బీజేపీకి ఫేవర్ చేసేలా ప్రధాని ప్రసంగం కొనసాగిందని నేతలు విశ్లేషించుకుంటున్నారు. టీఆర్ఎస్ కూడా ప్రధాని పబ్లిక్ మీటింగ్ లో పాల్గొనేలా ప్లాన్ చేసింది. పబ్లిక్ మీటింగ్ లో అయితే కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రధాని పొగడాల్సిన తప్పని పరిస్థితి. కనీసం చివరలో ప్రెస్ మీట్ అయినా ప్రదానితో పెట్టించాలని చూశారు. కాని ప్రధాని కార్యాలయం వీటికి అనుమతివ్వక పోవడంలోనూ రాష్ట్ర బీజేపీ నేతల వ్యూహం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద గత కొన్నినెలలుగా స్తబ్దుగా ఉన్న బీజేపీలో ప్రధాని పర్యటన నూతనోత్సాహం తీసుకొచ్చిందని చెప్పొచ్చు.
- Tags
- బీజేపీ

