బీజేపీకి మూడురోజుల టైం

వెనకపడిపోతామన్న ఆందోళనతోనే నాలుగేళ్లు తాను కేంద్రంపై మాట్లాడకుండా ఉండిపోయాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రజల మీద తనపై నమ్మకం పెట్టుకుని తనకు అధికారం ఇచ్చారన్నారు. కేంద్రం ఇవ్వాల్సిందంతా ఇవ్వాల్సిందేనని, రాజీ పడేలది లేదన్నారు. కేంద్రం కూడా తన మాట నిలబెట్టుకోవాలన్నారు. చట్టప్రకారం రావల్సిన ఇవ్వకపోవడం న్యాయమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోబోమని హెచ్చరించారు. తమవి గొంతెమ్మ కోర్కెలు కావన్నారు. న్యాయం చేయాలన్నారు. సమీక్ష చేసి దగా పడ్డ ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలన్నారు. ఆవేదనతో అడుగుతున్నానని, రాజకీయంగా అడగటం లేదన్నారు. పొత్తు వల్ల లాభం ఉంటుందనుకున్నాను. కలిసి ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని ఆశించానన్నారు. అడక్క పోతే చరిత్రలో ప్రజలు తనను క్షమించరని కేంద్రాన్ని నిలదీశానన్నారు. విభజన చట్టంలోని 18 అంశాలను మూడు రోజుల్లోగా పార్లమెంటులో ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
కట్టుబట్టలతో వచ్చాం....
విభజనసమస్యలను ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నామన్నారు. అమరావతికి కట్టుబట్టలతో వచ్చామన్నారు. నాటి ప్రధాని రాజ్యసభలో ఎన్నో హమీలు ఇచ్చారన్నారు. విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను కూడా అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ కలిసే రాష్ట్రాన్ని విభజించాయన్నారు. బీజేపీ న్యాయం చేస్తుందనే ఆపార్టీతో పొత్తుపెట్టుకున్నామని చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు రెడు గంటల పాటు ప్రసంగించారు. ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వాలని ఆరోజు ప్రధాని మన్మోహన్ చెప్పారన్నారు. ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. విభజించడం వల్లనే 128 చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు. అంత కసిగా ఏపీ ప్రజలున్నారన్నారు.
ఈశాన్య రాష్ట్రాల మాటేమిటి?
తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కూడా ఎన్నోహామీలిచ్చిందన్నారు. ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం తమతో చెప్పిందన్నారు. 14 ఆర్థిక సంఘాన్ని సాకుగాచూపి తమకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. అయితే ఈశాన్య రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ లకు వేరే రూపంలో ప్రయోజనం కల్పించారన్నారు. ఈ ప్రయోజనాలు వారికి ఇచ్చినప్పుడు మనకెందుకు ఇవ్వటం లేదని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎవరికీ ఇవ్వకపోతే అది వేరేవిషయమని, ఆ రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఏపీకి ఎందుకివ్వరన్నారు. ఇందులో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు.
హోదా సాధించేంత వరకూ....
ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని ప్రజలందరూ కోరుకుంటున్నారని, అది సాధించేంత వరకూ పోరాడాలన్నారు చంద్రబాబు. విభజన చట్టంలోని అంశాలన్నింటినీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారన్నారు. బీజేపీ మ్యానిఫేస్టోలో కూడా ప్రత్యేక హోదా ఇస్తామని పెట్టిందన్నారు. డిల్లీకి 29 సార్లువెళ్లి అందరినీ కలిసినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన చెందారు. 16 వేల కోట్లు రావాల్సి ఉంటే అంతా ఇచ్చేశామని, మరో 300 కోట్లు ఇస్తే సరిపోతుందని కేంద్రం చెబుతుందన్నారు. చివరకు వచ్చేసరికి లెక్కలు అడుగుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకూ13,400 కోట్లు ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం 5,349 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.
కేంద్రం లీకులన్నీ అబద్ధాలే....
నిన్న ఇచ్చిన లీకులు చూశానని, 12 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని, యుటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వలేదనికేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. అయితే అన్ని సర్టిఫికేట్లను ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉన్నామన్నారు. రెవెన్యూ లోటుకు సర్టిఫికేట్లు ఎందుకిస్తామన్నారు. రాజధానికి 1500 కోట్లు ఇచ్చారన్నారు. వెయ్యికోట్లరూపాయలు గుంటూరు, విజయవాడ డ్రైనేజీ, తాగునీటి కోసం ఇచ్చారన్నారు. వాటికి కూడా సర్టిఫికేట్లు త్వరలో పంపనున్నామని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పారని, అయితే నాలుగేళ్ల నుంచి ఎందుకివ్వలేక పోతున్నామని నిలదీశారు. కమిటీలతోనే కాలయాపన చేస్తున్నారన్నారు.
నిప్పులాంటి బతుకు నాది.....
దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడు ఎవరున్నా ఉన్నారంటే తానేనన్నారు. జాతీయ స్థాయిలో తాను కూడా ఒకప్పుడు పాత్ర పోషించాననిచెప్పారు. తన మీద కేసులున్నాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తనమీద ఎలాంటి కేసులు లేవన్నారు. తాను నిప్పులాగా బతుకుతున్నానని చెప్పారు. ప్రజలకోసమే పనిచేస్తున్నానని, ప్రజల సంక్షేమం కోసం తాను నిరంతరం పాటు పడుతున్నానని చెప్పారు. కేంద్రం ఏం చేయలేకపోతున్నా తాను చేయలేదని చెప్పడానికి సిద్ధంగా లేదన్నారు. మూడు నెలల కొకసారి తాను విశ్లేషించుకుంటున్నానని చెప్పారు. గ్రోత్ రేట్ పెరగడానికి కృషి చేశానని చెప్పారు. అందరు పడిన కష్టం వల్లనే ఇదిసాధించామని చెప్పారు. రాయలసీమలో చరిత్రలో ఎప్పుడూ జరగని అభివృద్ధిని చేసి చూపించామన్నారు. సెంటిమెంట్స్ ను కొందరు లేవెనెత్తాలని చూస్తున్నారని, రాయలసీమ, ఉత్తరాంధ్రలో మూడున్నర సంవత్సరాల నుంచి జరుగుతున్న అభివృద్ధిని చూడాలన్నారు. ఏపీకి ఇచ్చిన హామీల నుంచి బీజేపీ తప్పించుకోలేదన్నారు.
అన్నీ ప్రాజెక్టులనూ పూర్తి చేస్తాం...
వంశధార, నాగావళి, పెన్నా, కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేయనున్నామన్నారు. దీని ద్వారా మహా నదుల సంగమానికి శ్రీకారం చుట్టబోతున్నామనిచెప్పారు. మొత్తం 29 ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని, కొన్ని పూర్తయ్యాయని, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. వీటన్నింటినీ జూన్ లోపు పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నట్లు ప్రకటించారు. ఆర్బీఐ ఒప్పుకోకున్నా రైతు రుణ మాఫీ చేశామన్నారు. సీట్ల పెంపు గురించి తాను డిమాండ్ చేయడం లేదని, చట్టంలో ఉన్న వాటినే కోరుతున్నానని చంద్రబాబు చెప్పారు.
- Tags
- చంద్రబాబు
