బీకాంలో ఫిజిక్స్.. జలీల్ ఖాన్ మరో సంచలనం!

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్.. మరో సంచలన ప్రకటన చేశారు. బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ ఆయన గతంలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గుచ్చి గుచ్చి అడిగినా.. కూడా ఈ ఎమ్మెల్యేగారు.. బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని పట్టు బట్టి మరీ చెప్పుకొచ్చారు. దీంతో ఈ ఎమ్మెల్యేగారి సమాధానాలకు జనాలు నవ్వుకోలేక చచ్చారు! ఇక, ఇప్పుడు కూడా జలీల్ ఖాన్ తలా తోక లేని విధంగా స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పెద్ద హాట్ టాపిక్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా 2018 ఆఖరు నాటికి దీనిని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పోలవరం వివాదంలో....
అయితే, ఈ ప్రాజెక్టు భారీది కావడం, విభజన చట్టం ప్రకారం దీనిని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానికే ఉండడంతో వివాదం నెలకొంది. కేంద్రం కనుసన్నల్లోనే ఈ నిర్మాణం చేపట్టామని చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా, బాబు అడిగారు కాబట్టే నిర్మాణ బాధ్యత అప్పగించామని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో మందగించిన పనుల విషయంలో వివాదం నెలకొంది. కాంట్రాక్టును తిరిగి వేరే సంస్థకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించలేదు. పైగా, ప్రస్తుతం జరుగుతున్న కాఫర్ డ్యామ్ పనులను నిలిపివేయాలని కూడా కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేంద్రంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీకో నమస్కారం అంటూ ఆయన చేసిన కామెంట్లు హాట్ హాట్‌గా మారాయి!
ఆస్తులు అమ్ముతారట...
ఇక, ఈ కామెంట్లు సహా పోలవరం ప్రాజెక్టుపై స్పందించిన బీకాంలో ఫిజిక్స్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్.. తన దైన శైలిలో కామెంట్లు కుమ్మరించారు. కేంద్ర పథకం అని తెలిసి కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ ఆస్తులు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చంద్రబాబు లక్ష్యమని, ఆ లక్ష్యసాధనకు పోరాడుతామని.. పోలవరం పూర్తి చేసేందుకు అవసరమైతే బిచ్చమెత్తుతామని కూడా ఆయన అన్నారు. జోలెపట్టి నిధులు సేకరిస్తామని… పోలవరం ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేసి తీరుతామని జలీల్‌ఖాన్ తెలిపారు. దీంతో జలీల్ అనవసరమైన కామెంట్లు కుమ్మరించాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. డబ్బులు లేక ఆగిపోయిన ప్రాజెక్టు కాదు. పైగా.. ఒడిసా ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆగిన ప్రాజెక్టుపై జలీల్ వ్యాఖ్యలు ఆసక్తిగా మారడం విశేషం.
- Tags
- జలీల్ ఖాన్

