బిజెపి తో కాపురానికి అసలు కారణం అదేనా ...?

తెలుగుదేశం పార్టీ విపక్షానికి మించి మిత్రపక్షం బిజెపి పై తిరుగుబాటుకు అసలు కారణం అదేనా ...? ఇంతకీ అదేంటి అంటే అసెంబ్లీ సీట్ల పెంపు కమలనాధులు చేయకపోవడమే అన్నది ఆ పార్టీ నేతలు ఇప్పటికి బయట పెట్టేశారు. ఏపీలో నియోజకవర్గాల పెంపు లేకపోతే రాబోయే ఎన్నికల్లో టిడిపి గందరగోళంలో పడే ప్రమాదంలో వుంది. విపక్ష వైసిపి నుంచి దాదాపు 22 మందికి పైగా ఎమ్యెల్యేలకు టిడిపి ఇప్పటికే గోడ దూకించి తమ పార్టీలో కలుపుకుంది. మరికొందరిని కూడా ఎన్నికల్లోగా లాగడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదంతా చేయడానికి కారణం నియోజకవర్గాల పునర్విభన కు ఏపీ రీ ఆర్గనైజేషన్ చట్టంలో వెసులుబాటు ఉండటమే. సరిగ్గా ఈ పెంపు కోసం చంద్రబాబు కేంద్రం వద్ద చేయని లాబీయింగ్ లేదు. దీనికోసం పదే పదే బాబు అన్ని అంశాలు పక్కన పెట్టి మోడీని అడుగుతూ ఉండటంతో చివరికి ప్రధాని ఏడాదికి పైగా ఏపీ సీఎం కు అపాయింట్ మెంట్ అందుకే ఇవ్వలేదని ఢిల్లీ లో పొలిటికల్ టాక్ ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తుంది.
ఇక ప్రయోజనం లేదనే ...
ఇప్పటికి కూడా నియోజక వర్గాల పెంపు అంశం పూర్తి కాకపోతే రాజకీయంగా పొంచి వున్న ప్రమాదం గుర్తించే టిడిపి అధినేత ఎదురుదాడికి దిగారని బిజెపి నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. బాబు వ్యూహాలు గమనించే గత నాలుగేళ్లుగా అదిగో ఇదిగో అంటూ బిజెపి కేంద్ర నాయకత్వం ఊరిస్తూ ఇప్పుడు ఉసూరుమనిపించడంతో తమ్ముళ్ళు మిత్రపక్షంపై తిరుగుబాటు జెండా పట్టుకోవాలిసి వచ్చిందన్న బిజెపి ఆరోపణలు కూడా ఆలోచించదగ్గదే. ఈ అంశంపై పలుమార్లు తనను కలిసిన నేతలకు చంద్రబాబు భరోసా ఇస్తూ రావడం కేంద్రం నుంచి సంకేతాలు అందుతున్నాయంటూ తన మీడియా లో ప్రచారం చేసుకోవడం గమనిస్తే టిడిపి హిడెన్ ఎజెండా నియోజకవర్గాల పెంపు అన్నది తేలిపోతుంది. ప్రజల్లో మాత్రం దీనిపై వున్న వ్యతిరేకత దృష్ట్యా పైకి ప్యాకేజి, విభజన హామీలతో కేంద్రాన్ని టిడిపి ఉక్కిరిబిక్కిరి చేస్తుందని ఏపీకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నియోజకవర్గాల పెంపు ఇస్తే అన్ని సమస్యలకు సంజీవనిలా పరిష్కారం లభిస్తుందంటున్నారు విశ్లేషకులు.

