బాబు రెయిన్‌గన్ లు ఫలితమిచ్చాయా?

చంద్రబాబునాయుడు రెయిన్ గన్ లను వినియోగిస్తున్నాం... అనంతపురం జిల్లా కరవు రైతు కన్నీళ్లను తుడిచేస్తున్నాం అని పదేపదే చెప్పారు. రెయిన్‌గన్ ల ద్వారా సేద్యం అంటే.. అది ఎలా ఉంటుందో, ఎలా అవుతుందో ఏమిటో అని సగటు రైతు సందేహిస్తూ ఉండే లోగానే అప్పట్లో వర్షాలు కూడా వచ్చేసాయి. ఒక రకంగా ప్రభుత్వానికి ఊరట కలిగినట్లే. అయితే తాజాగా ఈ రెయిన్‌గన్ లతో పంటలను కాపాడాం అని చెబుతున్న వ్యవహారం మొత్తం బూటకం అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జనంలో కొత్త సందేహాలను లేవనెత్తుతున్నారు. aa
కరవు పీడిత రాయలసీమలో , వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనడానికి రైతులకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని, ఇప్పుడు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం చేయూతల అందించాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. రెయిన్ గన్ లతో పంటలను కాపాడేశాం అని చేసిన ప్రకటనలన్నీ బూటకం అని ఆయన కొట్టిపారేశారు. వాటి వల్ల ఒక్క చోట కూడా ఫలితం రాలేదని చంద్రబాబునాయుడు పర్యటించిన గ్రామాల్లోనే నిరూపిస్తాం అని కోట్ల సవాలు విసురుతున్నారు. ఆయన వచ్చినప్పుడు నాలుగు ట్యాంకర్లతో నీళ్లు తెప్పించి కొట్టారని చెబుతున్నారు.
రైతులకు పరిహారం ఎగ్గొట్టడానికే పంటలు కాపాడాం అని ప్రభుత్వం చెప్పుకుంటున్నదంటూ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇలాంటి విమర్శకుల నోర్లకు తాళాలు వేయించాలంటే ప్రభుత్వమే తాము రెయిన్ గన్ లను వినియోగించిన చోట్ల ఎలాంటి ఫలితం వచ్చిందో, ఆ కాన్సెప్టు గొప్పదనం ఏమిటో ఇప్పుడు ఓసారి వీడియోల సహితంగా ప్రపంచానికి చెబితే బాగుంటుంది.

