బాబు ముందు జాగ్రత్త పడుతున్నారా?

తెలుగుదేశం పార్టీ ముందు జాగ్రత్త పడుతోంది. ఎన్డీఏ నుంచి బయటకు రావడం, పవన్ కల్యాణ్ విమర్శల అనంతరం టీడీపీ కొంత డైలమాలో పడింది. క్యాడర్ లో ఆందోళన తొలగించేందుకు సిద్ధమైంది. ఎవరు మద్దతివ్వక పోయినా వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని పార్టీ శ్రేణులకు నూరిపోసే కార్యక్రమం చేపట్టింది. అలాగే కేంద్ర ప్రభుత్వం తీరును కూడా ప్రజలకు వివరించనుంది. మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ నేతలు నియోజకవర్గాల్లోనే పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు అసెంబ్లీకి సెలవులు రావడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఎన్డీఏ నుంచి వైదొలగడం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపైనా ప్రజలకు వివరించాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సూచించారు. ప్రతి నియజకవర్గంలో సభలను ఏర్పాటు చేసి ఈ మూడు రోజులు అదే పనిలో ఉండాలని టీడీపీ అధినేత ఆదేశించారు.
మూడు రోజుల పాటు....
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు ఎంత కష్టపడుతుందీ, ఇప్పటి వరకూ ఏఏ సంస్థలను ఏపీకి తెచ్చిందీ ప్రజలకు వివరించాలని ఆదేశించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని కూడా ప్రజల వద్ద ఎండగట్టాలని ఆదేశించారు. మోడీ సర్కార్ ఏపీ పట్ల చిన్నచూపు చూసిందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిమార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా కనికరించలేదని, అనుభవం గల చంద్రబాబును కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని కూడా ప్రజలకు వివరించాలని తెలుగుదేశం అధిష్టానం కోరింది.
ప్రజల వద్దకు వెళ్లి.....
ప్రతి నియోజకవర్గంలో మండల కేంద్రాల్లోనూ సభలను ఏర్పాుట చేయాలని ఆదేశించింది. అలాగే పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు, ఆయన వెనక ఎవరున్నదీ వివరించాలని తెలిపింది. పవన్ కల్యాణ్ బీజేపీ చెప్పినట్లే నడుస్తున్నారని, నాలుగేళ్ల నుంచి చంద్రబాబును, ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించిన పవన్ కల్యాణ్ ఉన్నట్లుండి యూటర్న్ తీసుకోవడానికి గల కారణాలను కూడా చెప్పాలని తెలిపింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మూడురోజులు నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజలకు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించాలని కళా వెంకట్రావు ఆదేశించారు. టీడీపీ చిత్తశుద్ధిని కూడా చెప్పాలని కళా వెంకట్రావు కోరారు. మొత్తం మీద టీడీపీ ఎన్నికలకు ముందే ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంది.
- Tags
- చంద్రబాబు
