బాబు ఫోర్స్ పెంచినా...అదే జరుగుతుందా?

ఎల్లుండితో పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్న సందర్భంలో చంద్రబాబు ఢిల్లీలో దూకుడు పెంచారు. జాతీయ పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. నిన్న శరద్ పవార్, జైరామ్ రమేష్, ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలను కలిసి బీజేపీ అన్యాయం గురించి వివరించారు. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి స్వయంగా వచ్చి చంద్రబాబుతో మాట్లాడారు. చంద్రబాబు తమ పాతమిత్రుడని అందుకే కలవడానికి వచ్చానని జోషి మీడియాకు చెప్పారు. ఈరోజు కేజ్రీవాల్ తో పాటు మరికొందరు జాతీయ నేతలతో చంద్రబాబు సమావేశం అవుతున్నారు.
అన్యాయంపై అందరికీ......
ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం, బీజేపీ చేసిన మోసాన్ని గురించి చంద్రబాబు వివరిస్తూ పోతున్నారు. ప్రతి నేతకు ప్రత్యేకంగా హిందీ, ఇంగ్లీషులతో కూడిన నివేదికలను బాబు వారికి అందజేస్తున్నారు. కో-ఆపరేటివ్ ఫెడరల్ వ్యవస్థ అంటూనే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని బాబు నేతలకు వివరిస్తున్నారు. జాతీయ నేతల నుంచి చంద్రబాబుకు మద్దతు లభిస్తుండటంతో టీడీపీ నేతల్లో ఉత్సాహం కన్పిస్తుంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన విజయవంతంగా నడుస్తుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈరోజు కూడా అవకాశాలు లేనట్లేనా?
మరోవైపు ఈరోజు కూడా అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశం కన్పించడం లేదు. అన్నాడీఎంకే తమ ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించడంతో ఈరోజు కూడా సభలో గందరగోళ పరిస్థితులే నెలకొంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో సభ మళ్లీ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇక పార్లమెంటు మరో రెండు రోజులు మాత్రమే కొనసాగనుంది. ఈ నెల 6వ తేదీతో నిరవధిక వాయిదా పడనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా అవిశ్వాసం చర్చకు వచ్చే అవకాశం లేకపోవడంతో టీడీపీ, వైసీపీ ఎంపీీలు తమ భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.
